అక్కినేని వారసుడిగా.. నాగార్జున తనయుడిగా.. అఖిల్ భారీ అంచనాల మధ్యన అఖిల్ అనే మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రికెట్ ఆటలో.. గొప్పమెళకువలు తెలిసిన ఆటగాడిగా ఉన్న అఖిల్‌కి నటనంటే ఫ్యాషన్ ఉండటంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్‌తో సినిమా చేసి హీరోగా నిలబడిపోదామనుకున్న అఖిల్‌కి మొదటి సినిమాతో దర్శకుడు వినాయక్ భారీ డిజాస్టర్ చేతిలో పెట్టాడు. తర్వాత.. ఏదో తెలియక మాస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాం.. ఈసారి కూల్ గా ప్రేమకథతో హిట్ కొడదామనుకున్నాడు.
నాగార్జున ఓన్ బ్యానర్‌లో తన కొడుకు కెరీర్ చక్కబెట్టే బాధ్యత తీసుకుని.. ఎంతో జాగ్రత్తగా దర్శకుడు విక్రమ్‌ని సెట్ చేసి ‘హలో’ సినిమా నిర్మించాడు. ఆ సినిమా లవ్ స్టోరీతో తెరకెక్కింది. సోల్మెట్ కోసం వెతికే లవర్ బాయ్‌లా అఖిల్ ఆకట్టుకున్నప్పటికీ... హలో సినిమా యావరేజ్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక మూడో సినిమాని ఆచి తూచి హిట్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేసాడు అఖిల్. తొలిప్రేమతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి అఖిల్‌ని లవర్ బాయ్‌లా మిస్టర్ మజ్నులో చూపెట్టాడు. అయితే రెండు చిత్రాల ఎఫెక్ట్ అఖిల్ మూడో చిత్రం మీద బాగానే పడింది. మొదటి నుండి వెంకీ మీదున్న అంచనాలు అఖిల్ మీద లేవు. మీడియం అంచనాలతో శుక్రవారం వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిస్టర్ మజ్ను మళ్లీ యావరేజ్ టాక్ నే సొంతం చేసుకుంది.
అఖిల్ యాక్టింగ్, డాన్సింగ్ స్టైల్, న్యూ లుక్ అన్ని కుర్రకారుకి నచ్చేలా ఉన్నాయి. కానీ వెంకీ దర్శకత్వం, కథ రొటీన్‌గా ఉండడం, అలాగే ఈ ప్రేమకథలో ఫీల్ మిస్సయింది. ఇంకా అఖిల్‌ని అమ్మాయిలా వెంటపడే అబ్బాయిలా అంటే.. స్త్రీలోలుడిగా చూపించడం.. ఒకానొక టైం లో హీరోయిన్ నిధి అతడిని చూసి అసహ్యించుకోవడం వంటి అంశాలతో చూపించాడు. కానీ చిన్న కారణాలతో తన అభిప్రాయాలు మార్చుకుని అతడితో గాఢమైన ప్రేమలో పడిపోతుంది. అది అంతగా కన్విన్సింగ్‌గా ప్రేక్షకుడికి అనిపించకపోవడంతో సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. మరి మూడో సినిమాతో అయినా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలన్న అఖిల్ మళ్ళీ యావరేజ్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తన బ్లాక్‌బస్టర్ డ్రీమ్‌ను మళ్లీ వాయిదా వేసుకోకతప్పలేదు అఖిల్.