తెలుగులో సంచలనం సృష్టించిన చిత్రం `అర్జున్‌రెడ్డి`. విజయ్ దేవరకొండను బంగారు కొండగా మార్చి టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. తెలుగు సినిమాల్లో పాత్ బ్రేకింగ్ సినిమాగా టాలీవుడ్ గమనాన్ని మార్చిన ఈ చిత్రాన్ని ప్రస్తుతం బాలీవుడ్‌లో `కబీర్‌సింగ్` పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. షాహీద్ కపూర్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్‌రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నాడు. టీసిరీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది.
అక్కడ షాహీద్ కపూర్ పాల్గొనగా పలు కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఇదే లొకేషన్‌లో జరిగిన ప్రమాదంలో రామ్‌కుమార్ అనే యూనిట్ మెంబర్ ప్రమాద వశాత్తు చనిపోవడంతో టీమ్ అంతా విషాదంలో మునిగిపోయింది. చిత్రీకరణ కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ నీటని రామ్ కుమార్ చెక్ చేస్తున్న క్రమంలో అతడి మఫ్లర్ జనరేటర్ ఫ్యాన్‌కు చుట్టుకోవడంతో రామ్ కుమార్ ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందడం చిత్ర యూనిట్‌ను కలవరానికి గురిచేసిందట.
`ఈ హఠాత్పరిణామం మమ్మల్ని ఎంతగానో బాధించింది. ప్రమాద వశాత్తు చనిపోయిన రామ్ కుమార్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అతడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం` అని నిర్మాతలు వెల్లడించారు. `అర్జున్‌రెడ్డి` సినిమాతో తెలుగులో దర్శకుడిగా పరియమై సంచలనం సృష్టించిన సందీప్‌రెడ్డి వంగ ఇదే సినిమాతో బాలీవుడ్‌కు దర్ఠశకుడిగా పరిచయమవుతున్నారు.