నిజానికి మెగాబ్రదర్ నాగబాబుకి జెంటిల్‌మేన్‌గా ఎంతో పేరుంది. చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి విమర్శలు చేసినా, ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ విమర్శల పరంపర సాగిస్తున్నా.. నాగబాబు మాత్రం కొంత కాలం కిందటి వరకు మౌనంగానే ఉంటూ వచ్చాడు. నిజానికి నందమూరి కుటుంబంతో మెగాస్టార్‌కి మంచి అనుబంధమే ఉంది. సినిమాలపరంగా, అభిమానుల పరంగా వీరిద్దరికి పోటీ ఉన్నప్పటికీ చిరు, బాలయ్యలు మంచి స్నేహితులు. సినిమా వేడుకలకు ఒకరినొకరు హాజరుకావడంతో పాటు పలు కుటుంబ వేడుకల్లో కూడా వీరిద్దరు ఎంతో సందడి చేశారు. బాలయ్య తనకి ఇండస్ట్రీలో ఉన్న అత్యంత ముఖ్యమైన స్నేహితుడు చిరంజీవినే అని ప్రకటించాడు.
ఇక నాగబాబు విషయానికి వస్తే ఆయనలోని విశ్వరూపం ‘రాంగోపాల్‌వర్మ అక్కుపక్షి’ అని తిట్టడం, యండమూరి వీరేంద్రనాథ్‌పై మండిపడటంతో ప్రారంభం అయి నేడు అది పీక్స్‌కి చేరింది. ఇక ఓ వేడుకలో పవన్ అభిమానులు పవర్‌స్టార్ పవర్‌స్టార్ అని అరుస్తుంటే.. ఆయన ఈ వేడుకకు రాలేదు.. ఆయన ఎందుకు రాలేదో మీరే ఆయన్ను అడగండి అని మండిపడ్డాడు. ఇక ఇటీవల పవన్‌పై గతంలో బాలయ్య చేసిన పలు వ్యాఖ్యలను తీసుకుని వరుసగా ఆయనపై వ్యంగ్యాస్త్రాలు, ప్రతి విమర్శలు, సెటైర్లు వేస్తూ.. ఆరు వీడియోల ద్వారా వార్నింగ్ ఇచ్చాడు.
ఇక ఇప్పుడు నాగబాబు అందరినీ వంతుల వారిగా ఉతికి ఆరేస్తున్నాడు. తాజాగా ఏపీ మంత్రి, చంద్రబాబు కుమారుడు, బాలయ్య అల్లుడు నారా లోకేష్‌పై పంచ్‌లు వేశాడు. ఇది బాగా వైరల్ అవుతూ మంచి స్పందన రాబట్టుకుంటోంది. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, ‘పిల్లలు.... దేవుడు చల్లని వారే.. కల్లాకపటం ఎరుగని కరుణామయులే’ అనే నాటి పాటను ఉదాహరణగా తీసుకుని, చిన్నపిల్లలు దేవుడువంటి వారని, వాళ్లకి కల్లాకపటం తెలియదని చిన్నప్పుడు ఓ పాటలో విన్నాను. పిల్లలు ఎప్పుడు నిజాలే మాట్లాడుతారు. చెడు మాటలు ఉండవు. నేను ‘మై చానెల్..నా ఇష్టం’ పేరుతో ఓ యూట్యూబ్ చానెల్ పెట్టాను.
ఈ వేదిక నుంచి రాజకీయ విమర్శలు కొనసాగిస్తాను అని చెబుతూ నారాలోకేష్ గతంలో ఏదో మాట్లాడబోయి, మరేదో మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశాడు. గతంలో టిడిపి సభలో లోకేష్ మాట్లాడుతూ.. ‘బంధుప్రీతి, మతపిచ్చి, కుల పిచ్చి ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది టిడిపినే’ అనే వ్యాఖ్యలను గుర్తు చేశారు. ‘ఇంత నిజాయితీగా ముందుకు వచ్చి, మీ పార్టీ గురించి నిజాలు చెప్పినందుకు థాంక్యూ లోకేష్ గారు.. ఇంత నిజాయితీగా ఉండటం దేశంలోని ఏ రాజకీయ నాయకునికి సాధ్యం కాదు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అంతే కాదు.. తాజాగా మరో వీడియోలో జగన్‌పై సెటైర్లు వేశాడు.
ఇటీవల జగన్ ఓ చానెల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన అవినీతిపై ప్రశ్నలు అడిగిన యాంకర్‌ని ఉద్దేశించి.. ‘ఇవే ప్రశ్నలను మీరు చంద్రబాబుని ఎందుకు అడగరు? ఆయన ఈ విషయంలో నన్ను మించి పోయాడు.. అనే అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశాడు. సరిగ్గా ఇదే పాయింట్ వద్ద ఆయన నాగబాబుకి దొరికి పోయాడు. ఆయన మాట్లాడుతూ.. ‘వీడు నాకంటే గొప్పవాడు.. అంటే నేను గొప్పవాడినే.. కానీ ఆయన నాకంటే గొప్పవాడు అనే అర్ధం వస్తుంది. ఇతను నాకంటే బాగా సాధించాడు.. అంటే నేను బాగానే సాధించాను. కానీ ఎదుటి వ్యక్తి ఇంకా ఎక్కువ సాధించాడు అనే మీనింగ్ ఉంది. వాడు నాకంటే పెద్ద వెధవ అంటే నేను వెధవనే. కానీ వాడు నాకంటే పెద్ద వెధవ అని అర్దమవుతుంది.
ఇలా తీసుకుంటే జగన్ నేను అవినీతి పరుడినే.. కానీ చంద్రబాబు నాకంటే పెద్ద అవినీతి పరుడు అని ఒప్పుకున్నట్లు అవుతుంది. ఒకరకంగా చూసుకుంటే అవినీతిలో నన్ను చంద్రబాబు మించి పోయాడు అనే జెలసీ జగన్‌లో ఉంది.. అంటూ ఎటకారాలు సంధించాడు. మరి రాబోయే రోజుల్లో మన మెగాబ్రదర్ ఇంకెవరెవ్వరిని టార్గెట్ చేస్తాడు? అనే ఆసక్తి కలుగుతోంది.