మెగాబ్రదర్స్ అంటే ఈ విషయంలో మాత్రం మెగాస్టార్ చిరంజీవిని పక్కనపెట్టాలి. ఆయన ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, ఎన్నికల్లో సొంతగా పోటీ చేసి, చివరకు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. తద్వారా రాజ్యసభలో ఎంపీగా, కేంద్రమంత్రి పదవిని సైతం అనుభవించాడు. కానీ ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించాడు. రాజకీయాల గురించి పల్లెత్తు మాట అనడం లేదు. ఇక ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వేడెక్కాయి. అయినా రాజకీయ సమీకరణలపై ఇంకా స్పష్టమైన అవగాహన రావడంలేదు.
ఒకవైపు చంద్రబాబు దేశంలోని ప్రతిపక్షాలను, ప్రాంతీయ పార్టీలను, కాంగ్రెస్‌ని బిజెపికి వ్యతిరేకంగా ఒకటి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. మరోవైపు కాంగ్రెస్ రాహుల్ కన్నా ఎక్కువ ఇమేజ్ ఉన్న తన సోదరి ప్రియాంకాకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిని చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పేరుతో కాంగ్రెస్‌తో టిడిపి జత కట్టింది. కానీ ఏపీలో మాత్రం కాంగ్రెస్ అన్ని స్థానాలలో స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించింది. వైసీపీ ఎన్నికల్లో బిజెపితో జత కట్టే అవకాశం లేదు. అయినా టిఆర్‌ఎస్, మజ్లీస్ సాయాన్ని ప్రచారంలో తీసుకోవడం ఖాయమైంది. ఎన్నికల అనంతరం బిజెపితో వైసీపీ కలవడం ఖాయమని అంటున్నారు.
ఇక జనసేన విషయానికి వస్తే కిందటి ఎన్నికల్లో బిజెపి, టిడిపి పార్టీల కూటమికి మద్దతు ఇచ్చినా ఈసారి మాత్రం వామపక్షాలతో కలిసి ముందుకు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొంతకాలం వైసీపీకి మద్దతుగా నిలుస్తుందని, కొంత కాలంగా మరోసారి టిడిపితో కలిసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. టిఆర్‌ఎస్, వైసీపీ కలిసి చంద్రబాబుపై కుట్ర చేస్తున్నాయని పవన్ అనడం, చంద్రబాబు కూడా పవన్ మనోడే.. ఆయన్నేమీ అనవద్దని తన పార్టీ నాయకులకు హితబోధ చేశాడని ప్రచారం జరుగుతోంది.
తాజాగా టిడిపి ఎంపీ టి.జె.వెంకటేష్ రాబోయే ఎన్నికల్లో టిడిపి, జనసేన కలిసే అవకాశం ఉందని వ్యాఖ్యలు చేశాడు. కానీ దీనిపై పవన్ మాత్రం ఘాటుగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వదిలిపెట్టబోను. మేము వద్దనుకుంటేనే చంద్రబాబు టీజీ వెంకటేష్‌కి రాజ్యసభ ఎంపీ సీటు ఇచ్చాడు. నా నోరు అదుపు తప్పితే మీరేమవుతారో నాకు తెలియదు. విశాఖ మన్యంలో టీడీపీ నేతలు కిడారి సర్వేశ్వర్‌రావు, సివేరి సోమ హత్యలకు చంద్రబాబే కారణం. టీజీ వెంకటేష్ తన వయసుకు తగ్గట్లు పెద్దమనిషిలా మాట్లాడాలి. లేదంటే నేను నోరు అదుపు తప్పి మాట్లాడాల్సివస్తుంది. కర్నూల్‌లో పర్యావరణాన్ని అడ్డగోలుగా నాశనం చేస్తున్నారు. కేవలం ఆయన పెద్దమనిషి అనే నేను గౌరవం ఇస్తున్నాను. ఏపీని అభివృద్ది చేస్తారనే నమ్మకంతోనే నేను మద్దతు ఇస్తే టిడిపి అధికారంలోకి వచ్చింది. ఇందు కోసం టిడిపి నుంచి నేనేమీ ఆశించలేదు. టిడిపి వ్యవహారశైలితో విసిగిపోయాను. ఆ పార్టీ ఇప్పుడు మరోసారి ఎలక్షన్ గేమ్ మొదలుపెట్టిందని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
దీనిపై టీజీ వెంకటేష్ స్పందిస్తూ, టిడిపితో జనసేన కలిస్తే బాగుంటుంది... అది ఆ పార్టీల అధినాయకులు చూసుకుంటారు అని మాత్రమే అన్నాను. ఇందులో తప్పేముంది? నా వ్యాఖ్యలను పవన్ పూర్తిగా విన్నట్లు లేడని సమాధానం ఇచ్చాడు. దీనిని బట్టి పవన్‌కి టిడిపితో కలిసే ఉద్దేశ్యమే లేదని తెలుస్తోంది.