టాలీవుడ్‌లో ఆ మధ్యకాలంలో ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్‌లుగా, ఫీల్‌గుడ్ ఫిల్మ్స్ డైరెక్టర్స్ ఇద్దరు పేరు తెచ్చుకున్నారు. వారిలో ఒకరు కరుణాకరన్ కాగా రెండో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. కరుణాకరన్ విషయానికి వస్తే పవన్‌కళ్యాణ్‌కి అద్భుతమైన ఇమేజ్‌ని తెచ్చిపెట్టిన ‘తొలిప్రేమ’ ద్వారా దర్శకునిగా పరిచయమై సంచలనం సృష్టించాడు. ‘తొలిప్రేమ’ చిత్రాన్ని అంత త్వరగా ఎవ్వరూ మర్చిపోలేరు. కానీ ఆ తర్వాత ‘యువకుడు, వాసు, బాలు (ఎబిసిడిఈఎఫ్‌జీ), హ్యాపీ, ఉల్లాసంగా.. ఉత్సాహంగా, డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట, చిన్నదాన నీకోసం, తేజ్ ఐ లవ్‌యు’ వంటి చిత్రాలలో కొన్ని హిట్స్ ఉన్నా ‘తొలిప్రేమ’ వంటి చిత్రాన్ని మాత్రం మరలా అందించడంలో విఫలమయ్యాడు.
ఇక బొమ్మరిల్లు భాస్కర్ విషయానికి వస్తే మంచి ప్రేమకథను, తండ్రీ కొడుకుల అనుబంధంతో మిక్స్ చేసి ‘బొమ్మరిల్లు’తో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత ‘పరుగు, ఆరెంజ్’ చిత్రాలు తీసినా ఆ స్థాయిని అందుకోలేకపోయాడు. మాస్ చిత్రంగా ‘ఒంగోలు గిత్త’, ‘బెంగుళూరు డేస్’కి తమిళ రీమేక్ చేసినా ఫామ్‌లోకి రాలేకపోయాడు. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం వెంకీ అట్లూరిలో మనకి మంచి యూత్‌ఫుల్ డైరెక్టర్ కనిపిస్తున్నాడు. ఎంతో డేంజర్ అయిన ‘తొలిప్రేమ’ అనే టైటిల్‌ని పెట్టుకుని, వరుణ్‌తేజ్‌తో చిత్రం చేసి మంచిహిట్ కొట్టాడు.
ఇక నాగార్జున, అఖిల్‌ని ఆయన్ని ఎంతగానో నమ్మి ఎందరో దర్శకులు, కథలను విన్న తర్వాత అఖిల్ మూడో చిత్రం ‘మిస్టర్ మజ్ను’ని ఆయన చేతిలో పెట్టారు. మరి వెంకీ ద్వితీయ విఘ్నాన్ని అధిగమిస్తాడా? లేదా? అనేది కొన్ని గంటల్లో తేలిపోతుంది.
ఇక దీని తదుపరి చిత్రాన్ని అతి తక్కువకాలంలోనే అభిరుచి ఉన్న నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న ‘మైత్రి మూవీ మేకర్స్’కి చేయనున్నాడు. ప్రస్తుతం మైత్రి మూవీస్ సంస్థ విజయ్ దేవరకొండతో ‘డియర్ కామ్రేడ్’తో పాటు పలు చిత్రాలను నిర్మిస్తోంది. తాజాగా వెంకీ అట్లూరి విజయ్‌కి ఓ అద్భుతమైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ స్టోరీని చెప్పాడని, ఈ స్టోరికి విజయ్‌తో పాటు మైత్రి సంస్థ కూడా ఫిదా అయినట్లు సమాచారం.
మొత్తానికి వెంకీ కెరీర్‌ని నిర్దేశించే చిత్రాలుగా ‘మిస్టర్ మజ్ను’, విజయ్-మైత్రిల చిత్రాలే అని చెప్పాలి. మరి ఈయననైనా కరుణాకరన్, బొమ్మరిల్లు భాస్కర్‌ల నుంచి గుణపాఠం నేర్చుకుని, కీలకమైన ఈ రెండు చిత్రాలను విజయతీరం చేరిస్తే ఈయన స్టార్ దర్శకుల కేటగిరీలోకి చేరుతానడంలో సందేహం లేదు.