తెలుగులో ఇప్పుడు మంచి వైవిధ్యభరితమైన చిత్రాలు వస్తున్నాయి. కానీ మార్పు అనేది ఒకరోజుతో ఆగిపోయేది కాదు... అది నిరంతరం కొత్త దారులను వెతుకుతూనే ఉండాలి. ఇక విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి వయసు మళ్లిన పాత్రల్లో ఏనాడు మెప్పించలేకపోయాడు. ‘స్నేహంకోసం’ చిత్రంలోని ముసలి క్యారెక్టర్‌ని కూడా ప్రేక్షకులు జీర్ణించుకోలేదు. మరో వైపు బాలయ్య ‘ఒక్కమగాడు’, వెంకటేష్, నాగార్జున... ఇలా వీరందరు వయసుకు తగ్గ పాత్రలను ఇప్పుడు పోషిస్తున్నారే గానీ వయసుని మించిన పాత్రలతో ఆకట్టుకోవడం లేదు. ఇక స్టార్స్ కాబట్టి వారికున్న ఇమేజ్, క్రేజ్ దృష్ట్యా అలాంటి పాత్రలు చేయలేకపోతూ ఉండవచ్చు.
అదే తమిళంలోకి వస్తే రజనీ తన చిత్రాలలో యంగ్ పాత్రలతో పాటు ముసలి గెటప్పులు కూడ వేసినా జనాలు ఆదరించారు. ఇక కమల్‌హాసన్ ‘భారతీయుడు’ అనే కాదు.. కమల్‌తో పాటు విక్రమ్, సూర్య, తాజాగా విజయ్‌సేతుపతి వంటి వారు కూడా ఇలా ప్రయోగాలు చేస్తూ రాణిస్తున్నారు. యంగ్‌స్టార్ అయిన విజయ్‌సేతుపతి ‘96, సీమకత్తి’ చిత్రాలలో తన విశ్వరూపం చూపించాడు. ఇక ‘96’ చిత్రాన్ని దిల్‌రాజు.. శర్వానంద్, సమంతలతో రీమేక్ చేస్తున్నాడు. 20ఏళ్ల ముందు కంప్యూటర్లు, సెల్‌ఫోన్‌లు లేని కాలాన్ని అద్భుతంగా చూపించి, వర్తమానంతో ఈ యూనిట్ అద్భుతం చేసింది. ఇక శర్వానంద్ ‘మళ్లీమళ్లీ ఇది రాని రోజు’ లో వయసు మళ్లిన పాత్రలో కనిపించి మెప్పించాడు. ఆయన ఎప్పుడు కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తాడు.
కానీ ‘96’ రీమేక్‌లో మాత్రం 10ఏళ్ల ముందు కాలాన్నే చూపిస్తారని తెలుస్తోంది. కానీ పదేళ్ల కిందట అంటే కంప్యూటర్లు, సెల్‌ఫోన్స్ కూడా వచ్చాయి. దీని వల్ల ఒరిజినల్ ఫీల్ దెబ్బతింటుంది. ఇలా ఫీల్ మిస్ అయిన ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్లా’ ఇది కూడా సరిగా ఆడకపోతే తప్పును ప్రేక్షకుల మీద వేయడం సరికాదు. ఇక తాజాగా మాధవన్ నిజమైన వెర్సటైల్ నటుడంటే ఎలా ఉండాలో నిరూపిస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ‘సఖి’లో లవర్‌బోయ్‌గా, ‘యువ’లో రౌడీగా, సరిగా ఆడకపోయినా ‘సవ్యసాచి’లో కూడా ఈయన మెప్పించాడు. ప్రస్తుతం ఆయన ‘రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్’లో సుప్రసిద్ద సైంటిస్ట్ నంబి నారాయణ్ బయోపిక్‌లో నటిండమే కాదు.. మొదటి దర్శకుడు తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలను కూడా తన భుజాన వేసుకున్నాడు.
ఇక తాజాగా ఆయన నంబి నారాయణ్‌ని మరిపించేలా ఉన్న గెటప్‌ని చూపిస్తే, పక్కనే నంబి ఫొటోలను కూడా సోషల్‌మీడియాలో పెడితే ఎవరు నిజమైన నంబి నారాయణ్ అనేది తెలియనంతగా ఆ పాత్రలో, గెటప్‌లో ఆయన ఒదిగిపోయిన తీరు అద్భుతం. మరి మన హీరోలు భేషజాలు పక్కనపెట్టి ఎప్పుడు ఇలాంటి పాత్రలతో తమ సత్తా చాటుతారో వేచిచూడాల్సివుంది.