సాంకేతిక నిపుణుల విషయంలో కూడా ఒకప్పుడు హీరోల అభిప్రాయాలే చెల్లుబాటు అయ్యేవి. కానీ నేటితరం దర్శకులు మాత్రం తమకి నచ్చిన యూనిట్‌ని పెట్టుకుంటూ, వారిని తమ పర్మినెంట్ యూనిట్‌గా మార్చుకుంటున్నారు. ఈ విషయంలో హీరోలు, స్టార్స్ కూడా దర్శకుల అభిప్రాయాలకు గౌరవం ఇస్తున్నారు. ఇక విషయానికి వస్తే టాలెంట్ ఉన్నోడు దునియా మొత్తాన్ని ఏలుతాడు.. ఒకటి రెండు ఫ్లాప్‌లతో అతని కెరీర్ ముగిసిపోదు. ఎన్నో కారణాల వల్ల ఫ్లాప్‌లు, విమర్శలు వచ్చినా గోడకి కొట్టిన బంతిలా మరలా ఎగిరే సముద్ర కెరటంలా దూసుకుపోతాడు. ఇది తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌కి బాగా వర్తిస్తుంది.
‘కొలవెరి’తో దేశాన్ని ఓ ఊపు ఊపిన ఈయన ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం రెహ్మాన్ కంటే అందరు స్టార్స్‌కి, భారీ చిత్రాలకు కేరాఫ్‌గా మారుతున్నాడు. ‘భారతీయుడు 2’ నుంచి ఆయన చేతిలో ఎన్నో భారీ అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ అనిరుధ్‌ని త్రివిక్రమ్ తన ‘అ..ఆ’తోనే తెలుగులోకి ఎంట్రీ ఇప్పించాలని ప్రయత్నించినా, బిజీ షెడ్యూల్ వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో త్రివిక్రమ్ మిక్కీ జే మేయర్‌ని తీసుకున్నాడు. కానీ ఆ తర్వాత భారీ అంచనాలతో తీసిన పవన్‌కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ ద్వారా తెలుగులోకి స్ట్రెయిట్ ఎంట్రీ ఇప్పించాడు. కానీ ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలోనే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో ఈ చిత్రం డిజాస్టర్‌కి కూడా అన్ని కారణాలు ఉన్నాయి. కానీ పవన్ రాజకీయాలలో బిజీ అయ్యాడు.. మరలా త్రివిక్రమ్ ‘అరవింద సమేత’తో ముందుకు వచ్చాడు. కానీ దీనికి బలైపోయింది మాత్రం అనిరుధ్ అనే చెప్పాలి.
ఇలాంటి పరిస్థితుల్లో ట్యూన్స్‌కి, అంతకంటే బిజీఎంకి ఎక్కువ ప్రాధాన్యం ఉండే స్పోర్ట్స్ డ్రామాగా గౌతమ్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘జెర్సీ’ చిత్రంతో అనిరుధ్ మరోసారి తెలుగు సంగీత ప్రియులను మెప్పించాలనే కసితో ఉన్నాడు. ఇక ఈ చిత్రం కోసం అనిరుధ్ ఇచ్చిన ట్యూన్స్ నానిని బాగా మెప్పించాయని తెలుస్తోంది. దాంతో దీని తదుపరి నాని నటించే విక్రమ్ కె కుమార్ చిత్రానికి కూడా అనిరుధ్‌నే పెట్టుకోవాలని నాని.. విక్రమ్‌పై ఒత్తిడి తెస్తున్నాడని తెలుస్తోంది.
విక్రమ్ కె.కుమార్ చిత్రాలకు గతంలో అద్భుతమైన సంగీతం అందించిన అనూప్ రూబెన్స్‌ని పెట్టుకోవాలని మొదట విక్రమ్ భావించాడని, కానీ ఇప్పుడు నాని ఒత్తిడితో అనూప్ స్థానంలో అనిరుధ్‌ని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తంగా ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రంలో మొదట అనిరుధ్‌ని పెట్టుకుని, చివరి నిమిషంలో తప్పించి, తమన్‌ని పెట్టుకున్నందుకు అవమానంతో బాధపడిన అనిరుధ్ ‘జెర్సీ’ చిత్రానికి ఎలాంటి సంగీతం అందించాడో చూడాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే. ఈ చిత్రం ఫలితంపైనే నాని-విక్రమ్ కె.కుమార్‌లు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది...!