మెగాస్టార్ చిరంజీవికి, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కి తమ మేనల్లుళ్లు అంటే బాగా ఇష్టమని చెప్పాల్సిన పనిలేదు. సాయిధరమ్‌తేజ్‌ని తెరంగేట్రం చేయడంలో పవన్ పడిన కష్టం అంతా ఇంతాకాదు. ఆదిత్యఓంనే కాదు.. ఏకంగా నేడు యంగ్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న రామ్‌ని కూడా ‘దేవదాస్’ ద్వారా లాంఛ్ చేసిన వైవిఎస్ చౌదరిపై ఎంతో నమ్మకంతో పవన్ ‘రేయ్’ చిత్రం బాధ్యతలను చౌదరికి అప్పగించాడు. చౌదరిపై నందమూరి వీరాభిమాని అనే పేరు ఉన్నా కూడా పవన్ చౌదరిని నమ్మి, ఆయనకు ఘోస్ట్ ప్రొడ్యూసర్‌గా ఉండి ఆ చిత్రానికి ఆయనే పెట్టుబడి పెట్టాడంటూ వార్తలు వచ్చాయి.
ఇక సాయిధరమ్‌తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా తరచుగా పవన్‌కళ్యాణ్ ఆఫీసులో కనిపిస్తూ ఉండటంతో ఆయనను కూడా పవన్ హీరోని చేయడం ఖాయమని నాడు టాలీవుడ్ కోడై కూసింది. దానిని సాయిధరమ్‌తేజ్ కొట్టి పారేసినా వైష్ణవ్‌తేజ్ ఎంట్రీ మూవీ లాంఛ్ అయి నిజమేనని నిరూపించింది. అంతేకాదు.. పవన్‌కళ్యాణ్ లక్షణాలు, రూపురేఖలన్ని తన చిన్నమామయ్య పవన్‌లానే ఉంటాయనే ఉద్దేశ్యంలో పవన్ నటించిన డిజాస్టర్ మూవీ ‘పంజా’ని ఓ బిరుదుగా ‘పంజా వైష్ణవ్ తేజ్’ అంటూ మార్చారు. ఈ తాజా మూవీ ఓపెనింగ్‌కి చిరు, చరణ్, బన్నీ, సాయిధరమ్‌తేజ్ ఇలా అందరు హాజరయ్యారు. అయితే ఇంతమంది హాజరైనా పవన్ కనిపించలేదు. బహుశా తన చిన్నమేనల్లుడుకి ఆయన ముందుగానే ఆశీస్సులు ఇచ్చి ఉండే అవకాశం ఉంది.
ఇక పవన్ ఈ వేడుకకు హాజరు కాకపోవడం పలు చర్చలకు తెరతీసింది. పవన్ ఎన్నికల సమయం సమీపించినందువల్ల పార్టీ కార్యక్రమాలలో బిజీగా ఉండి రాలేకపోయాడని కొందరు అంటుంటే.. పవన్ ఆమధ్య సినిమాలు చేస్తూ, ఒకటి, అరా వేడుకలకు హాజరవుతూ, కేవలం ట్విట్టర్ పులి అని, పార్ట్ టైం పొలిటీషియన్ అనే విమర్శలను ఎదుర్కొన్నాడు. అదే పరిస్థితి ఇలాంటి కీలక సమయంలో తాను ఈ వేడుకకు హాజరైతే మరలా తనపై వస్తాయనే ముందు చూపుతోనే పవన్ ఈ వేడుకకు హాజరుకాలేదనేది మరో వాదన.
అయినా ప్రతిపక్షాలు, మీడియా ‘ప్రతిధ్వని’ చిత్రంలో పరుచూరి గోపాలకృష్ణ చెప్పిన డైలాగ్‌లా.. హాజరైతే ఒక విధంగా, హాజరుకాకపోతే మరో విధంగా విమర్శలు చేయడం సహజమే. వారికి కావాల్సింది కాంట్రవర్శీ. కాబట్టి పవన్ వేడుకకు హాజరుకాకపోవడంతో దీనిని మీడియా, ప్రతిపక్షాలు ఎలా వాడుకుంటాయో వేచిచూడాల్సివుంది...! మరోసారి సినీ వారసత్వం విమర్శలైతే తప్పేలా లేవని చెప్పాలి.