స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథని తెరకెక్కిస్తూ బాలకృష్ణ చేసిన సాహసం ` `ఎన్టీఆర్ కథానాయకుడు`. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో అత్యంత డిజాస్టర్ గా నిలిచింది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏ విషయంలో ప్రేక్షకుల్ని సంతృప్తిపరచలేకపోయింది. ఎన్టీఆర్ బయోపిక్ అనగానే దీనిపై సర్వత్రా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే వాటికి ఏ మాత్రం మ్యాచ్ కాకపోవడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆశించిన స్థాయిలో ఆదరించలేదు...ఆసక్తిని కూడా చూపించలేదు. బయోపిక్‌ల చరిత్రలోనే `ఎన్టీఆర్ కథానాయకుడు` దారుణ వైఫల్యాన్ని చవిచూసి మేకర్లతో పాటు బాలకృష్ణను షాక్‌కు గురిచేసింది.
భారీ అంచనాల మధ్య భారీ మొత్తం చెల్లించి ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్‌ని సొంతం చేసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ దారుణంగా నష్టపోయారు. 70.58 కోట్లకు బిజినెస్ జరిగిన ఈ చిత్రం కేవలం 20 కోట్లని మాత్రమే రాబట్టింది. దీంతో డిస్ట్రిబ్యూటర్‌లు భారీ స్థాయిలో నష్టపోయారు. ఆ నష్టాన్ని పూడ్చేందుకు బాలకృష్ణ, నిర్మాతలు రెండవ భాగం `మహానాయకుడు`తో సాహసం చేయబోతున్నారు. తొలి భాగాన్ని భారీ రేట్లకు కొని నష్టపోయిన వారికి పైసా తీసుకోకుండా రెండవ భాగాన్ని ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రెండవ భాగం `ఎన్టీఆర్ మహానాయకుడు` ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది. దీని ద్వారా పంపిణీదారుల పెట్టుబడి పోను ఏది వస్తే అది ఇమ్మనే ఒప్పందంతో రెండవ భాగాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలిసింది.
ఇలా ఓ భారీ చిత్రాన్ని పైసా ఆశించకుండా నష్టపోయిన పంపిణీదారులకు అందించడం తెలుగు చలన చిత్ర చరిత్రలో చెప్పుకోదగ్గ సాహసం అని సినీ విమర్శకులు, ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. బాలకృష్ణ అండ్ కో సాహసం ఫలించి రెండవ భాగం ఆడితే బయ్యర్లతో పాటు నిర్మాతలు గట్టెక్కే అవకాశం వుంది. అలా కాని పక్షంలో బయ్యర్లతో పాటు చిత్ర బృందం కూడా భారీ నష్టాలను చివిచూడక తప్పదు.