యంగ్‌రెబెల్‌స్టార్ ప్రభాస్ ఈరోజున ‘బాహుబలి’ తర్వాత దేశవిదేశాలలో కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకుని నేషనల్ ఐకాన్‌గా మారాడంటే దాని వెనుక ఎంతో కఠోరశ్రమతో పాటు పెదనాన్న రెబెల్‌స్టార్ కృష్ణంరాజు ఆశీస్సులు ఎంతగానో ఉన్నాయి. బహుశా ప్రభాస్ ఈ స్థాయిలో ఉన్నాడంటే సంతోషించే వారిలో కృష్ణంరాజు తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. ఆయన ఒకానొక ప్రెస్‌మీట్‌లో స్టార్‌గా ఎదిగే మార్గం ప్రభాస్‌కి సూచించాడు. చిరంజీవి మెగాస్టార్ అయ్యాడంటే ఆయన పిల్లల మనసులను గెలుచుకోవడం కూడా ముఖ్యకారణమని, ఓ నటుడు స్టార్ కావడంలో చిన్నపిల్లలైన అభిమానుల అండ ముఖ్యమని, వారికి నచ్చితే కుటుంబం మొత్తం ఆ చిత్రాన్ని చూస్తారని విజయరహస్యం బోధించాడు. అనుకున్నట్లుగానే ప్రభాస్ ‘బాహుబలి’తో పిల్లలని మెప్పించి నేడు టాప్‌స్టార్ అయ్యాడు.
ఇక ప్రభాస్ కెరీర్ మొదట్లో ఆయనకు ఈ రేంజ్ స్టార్ స్టేటస్ లేదు. పెద్దగా స్టార్ కాకుండానే ఆయనతో చిత్రం చేసి, తన చిరకాల వాంఛ అయిన దర్శకత్వం వైపు మరలడం కృష్ణంరాజు ఇబ్బందిగా ఫీలయ్యాడు. ఎందుకంటే ప్రభాస్‌తో అలాంటి సాహసం చేయాల్సిన సమయం అది కాదని ఆయనకు అనుభవం నేర్పిన పాఠం. కృష్ణంరాజు డ్రీమ్ ప్రాజెక్ట్స్‌లో ‘విశాల నేత్రాలు, భక్త కన్నప్ప’ ఎంతో ముఖ్యమైనవి. కానీ అవి రెండు ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు సరికదా నేడున్న స్టార్‌స్టేటస్‌కి అనుగుణంగా భారీగా ఈ చిత్రాలను నిర్మించి, తానే దర్శకత్వం వహించాలనే కోరిక కూడా కృష్ణంరాజుకి తీరలేదు.
ఇక ‘భక్తకన్నప్ప’ని ప్రభాస్‌తో గ్రాండియర్‌గా తీయాలని కృష్ణంరాజు భావించాడని, కానీ దానికి మోహన్‌బాబు, మంచు విష్ణుల బెడద ఎదురైందని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా కృష్ణంరాజు మాట్లాడుతూ, త్వరలోనే తమ గోపీకృష్ణ మూవీస్ బేనర్‌లో ప్రభాస్‌తో ఓ లవ్‌స్టోరీ నిర్మిస్తాను. అందులో నేను కూడా కీలకపాత్రను పోషిస్తానని చెప్పాడే గానీ దర్శకత్వం విషయం ఎత్తక పోవడం గమనార్హం.
ఇంకా ఆయన మాట్లాడుతూ, నేను 50ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. అప్పట్లో హీరోల మధ్య మంచి సత్సంబంధాలు ఉండేవి. ఇప్పుడు మహేష్, ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ వంటి వారి మధ్య అలాంటి మంచి సత్సంబంధాలు ఉండటం ఆనందంగా ఉంది. నేను ప్రత్యేకంగా బర్త్‌డేలు సెలబ్రేట్ చేసుకోను. అయితే నటునిగా 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఓ ఫంక్షన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాను. సుదీర్ఘకాలంగా మాతో ప్రయాణిస్తున్న అభిమానులను సత్కరించుకోవాలని అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన విషయాలను త్వరలోనే తెలియజేస్తానని ప్రకటించడం రెబెల్‌స్టార్ ఫ్యాన్స్‌కి తీపికబురేనని చెప్పాలి.