టాలీవుడ్‌లో ఎస్వీరంగారావు తర్వాత ఆ గంభీరమైన రూపం, నటన ఎవ్వరికీ రాలేదనే చెప్పాలి. ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి వారితో సమానమైన ఇమేజ్, ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉన్న స్టార్స్, వారసులు వచ్చారే గానీ ఎస్వీరంగారావుని భర్తీ చేసే నటుడు ఇప్పటి వరకు పుట్టలేదు. ఆ తర్వాత ఎంతో కొంత కైకాల సత్యనారాయణ, గుమ్మడి, రావుగోపాలరావు, కోట శ్రీనివాసరావు, మోహన్‌బాబు వంటి నటులు ఉన్నా ఆయనకు సాటి మాత్రం రారనే చెప్పాలి.
ఇక తాజాగా సీనియర్ తెలుగు స్టార్, రెబెల్‌స్టార్ కృష్ణంరాజు తన 50ఏళ్ల సినీ నటనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడుతూ, ఇటీవల నేను చూసిన చిత్రాలలో ‘మహానటి’ అద్భుతంగా ఉంది. ఇక నాకు ఎస్వీరంగారావు గారి బయోపిక్ చూడాలని ఉంది. ఆ పాత్రను ప్రస్తుత విలక్షణ నటునిగా పేరు తెచ్చుకున్న ప్రకాష్‌రాజ్ పోషిస్తే బాగుంటుందని కుండబద్దలు కొట్టాడు. ఈ విషయంలో ఎవరైనా కృష్ణంరాజుతో ఏకీభవిస్తారు గానీ స్వయానా కృష్ణంరాజే ఎస్వీరంగారావుగా నటిస్తే ఎలా ఉంటుంది? అనే కొత్త చర్చ కొందర్లో మొదలైంది. ఈ బృహత్తర కార్యానికి స్వయంగా కృష్ణంరాజునే పూనుకుంటూ దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తం ఆయనకు రుణపడి ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నో నెగటివ్‌లు ఉన్నా ఏమాత్రం వాటిని బయటపెట్టకుండా ‘పోయినోళ్లంతా దేవుళ్లు’ అన్న తరహాలో బయోపిక్‌లు వస్తున్న నేటి రోజుల్లో ఎస్వీరంగారావు వ్యక్తిగత జీవితంతో, కెరీర్‌తో ఆటాడుకున్న వారి బండారాలను, ఆయా పెద్ద మనుషుల నిజస్వరూపాలను తెరకెక్కించే ధైర్యం నేటి వారికి ఉందా? అంటే లేదనే సమాధానమే వస్తుంది.
ఇక కృష్ణంరాజు తాజాగా ప్రభాస్ వివాహంపై కూడా నోరు విప్పాడు. వాస్తవానికి నేడు దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ప్రభాస్‌ని చెప్పుకోవాలి. ఆయన పెళ్లి కోసం ఎందరో కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ ‘బాహుబలి’ పూర్తయిన తర్వాత అని, మొదటి భాగం పూర్తయిన తర్వాత అంటూ ఇప్పటికే పలుసార్లు ఆయన పెదనాన్న కృష్ణంరాజు తెలిపాడు. తాజాగా ఆయన ప్రభాస్ పెళ్లి వేడుకను ‘సాహో’ తర్వాత చూడవచ్చని తెలిపాడు. మరి పెళ్లి అంటే మాత్రం ఏదో సాకు చూపుతూ వస్తోన్న ప్రభాస్ ‘సాహో’ తర్వాత అయినా ఓ ఇంటివాడవుతాడేమో చూడాలి...! మరోవైపు అటు అనుష్కతో, ఇటు షర్మిలతో ప్రభాస్‌పై దుష్ప్రచారం సాగుతోంది. వీటికి చెక్ పెట్టేందుకైనా కృష్ణంరాజు మరోసారి గట్టి ప్రయత్నం చేస్తే అందరు సంతోషిస్తారనే చెప్పాలి.