రెబెల్‌స్టార్ కృష్ణంరాజు తన కెరీర్‌లో ఎన్నో మరపురాని చిత్రాలలో నటించాడు. విలన్ పాత్రలు, చిన్న చిన్న వేషాల నుంచి రెబెల్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నిన్నటితరంలో ఎన్టీఆర్, ఏయన్నార్‌ల తర్వాత కృష్ణ, కృష్ణంరాజులు మాస్ హీరోలుగా, యాక్షన్ హీరోలుగా, తమదైన కుటుంబ కథా చిత్రాలలో కూడా నటించి మెప్పించారు. శోభన్‌బాబు కాస్త వెరైటీ రూట్‌లో ఇద్దరు భార్యల, ప్రియురాళ్ల మధ్య నలిగే ఫ్యామిలీ ఇమేజ్‌ని తెచ్చుకున్నాడు.
ఇక రెబెల్‌స్టార్ కృష్ణంరాజు ఆజానుబాహుడు. నిప్పుల్లా కణకణలాగే కళ్లతో, భారీ విగ్రహంతో ఆయన కనిపిస్తే అభిమానులు పండుగ చేసుకునే వారు. అంతటి గంభీరమైన విగ్రహం ఆయనది. ఆయనను చూస్తే భయపెట్టేలా ఉంటాడు. కానీ ఆయన మాట, మనసు మాత్రం వెన్న. పసిపిల్లాడిలా కల్మషం లేకుండా ఉంటాడు. ఆయనలోని ఈ గొప్ప లక్షణాలన్నీ ఆయన వారసుడైన ప్రభాస్‌కి వచ్చాయి. ఇక ఈయన నాడు బిజెపిలో చేరి ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా కూడా పనిచేశాడు. వాజ్‌పేయ్, అద్వానీలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. కానీ ఆ తర్వాత ఆయన పార్టీలు మారాడు. చిరంజీవి ప్రజారాజ్యంలో కూడా చేరి తప్పు చేశాడు.
ప్రస్తుతం కేంద్రంలోని బిజెపికి చెందిన మోదీ, అమిత్‌షాలతో ఈయనకు పెద్దగా సన్నిహిత సంబంధాలు లేవని, ఉండి ఉంటే ఇప్పటికే ఏదో రాష్ట్రానికి గవర్నర్ అయ్యే వాడని కూడా కొందరు అంటారు. కానీ వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రభాస్‌కి ఉన్న క్రేజ్ చూసి మోదీ-షాలు మరలా కృష్ణంరాజుని బాగానే వర్కౌట్ చేసినట్లుగా కనిపిస్తోంది.
ఆయన తాజాగా మాట్లాడుతూ, గతంలో బిజెపి తరపున కర్ణాటకలో ప్రచారం చేశాను. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అధిష్టానం ఆదేశిస్తే ఇక్కడైనా ప్రచారం చేసేందుకు సిద్దంగా ఉన్నాను.. అని చెప్పుకురావడం చూస్తే రాబోయే ఎన్నికల్లో ప్రభాస్ ఫ్యాన్స్ బిజెపికి దానికి పొత్తు పార్టీలా వ్యవహరిస్తున్న వైసీపీకి మద్దతు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందునా షర్మిలా విషయంలో జరుగుతున్న ప్రచారం పట్ల ప్రభాస్ అభిమానులు కూడా టిడిపిపై కోపంతో ఉన్నారనే చెప్పాలి.