తెలుగు ఇండస్ట్రీలో అటు రాంగోపాల్‌వర్మ.. ఇటు పోసాని కృష్ణమురళి.. ఇద్దరివీ రెండు విభిన్నమైన మనస్తత్వాలు, ఎంతో కాలం చంద్రబాబు నాయుడుకి వీరాభిమానిగా ఉండి దినపత్రికలలో మనం చంద్రబాబుకి ఎందుకు ఓటు వేయాలి? అనే విషయాన్ని వివరిస్తూ ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చిన ఘనత కృష్ణమురళికి దక్కుతుంది. ఆ తర్వాత చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీలో చేరి చిలకలూరి పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఉన్నది ఉన్నట్లు మొహాన మాట్లాడటంలో పోసాని తర్వాతే ఎవరైనా..!
ఇటీవల ఆయన రాబోయే ఏపీ ఎన్నికల్లో వైసీపీకి, జగన్‌కి మద్దతు ఇస్తున్నానని చెప్పి, అదే తడవుగా జగన్‌కి అనుకూలంగా వ్యాఖ్యలు గుప్పిస్తున్నాడు. అయితే నాడు ఆయన ఓ కండీషన్ కూడా చెప్పాడు. తాను వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇస్తానని, జగన్ సీఎం అయిన తర్వాత ఆయన పాలన చూసి తర్వాత ఎన్నికల్లో ఆయనకు మద్దతు తెలపాలా? వద్దా? అనేది నిర్ణయించుకుంటానని అన్నాడు. అలాంటి పోసాని తాజాగా మాట మార్చినట్లు కనిపిస్తోంది.
ఆయన మాట్లాడుతూ, బతికినంత కాలం వైసీపీకి విధేయుడిగా ఉంటానని, ఆ పార్టీ సేవలోనే తరిస్తానని అన్నాడు. ఇక ప్రస్తుతం షర్మిలకు, ప్రభాస్ మధ్య అక్రమ సంబంధం ఉందని సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తాజాగా షర్మిల మనోవేదనకి గురయిన సంగతి తెలిసిందే. అయితే సోషల్‌మీడియా విస్తారం అయిన నేపధ్యంలో ప్రతి పార్టీపై, అందులోని నాయకులపై ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇందులో ఎవరు పతితులు కాదు. చంద్రబాబు, లోకేష్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారిపై కూడా వైసీపీ సానుభూతి పరులు ఇలాంటి ప్రచారమే చేస్తున్నారనేది వాస్తవం. ఇక షర్మిలకు మద్దతు తెలుపుతూ ఇప్పటికే రచయిత చిన్నికృష్ణ ఆమెని కలియుగ సీతతో పోల్చాడు.
తాజాగా పోసాని మాట్లాడుతూ, నా జీవితంలో ఎన్నో కోరికలు కోరుకున్నాను. కానీ అవ్వన్నీ నీతిమంతమైన కోరికలే. వైసీపీ గెలవాలని, జగన్ సీఎం కావాలని ఇప్పుడు నిజాయితీగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి మహిళంటే గౌరవం లేదు. లక్ష్మీపార్వతిని ఎంతో గౌరవంగా చూడాల్సివున్నా కూడా చంద్రబాబు నాడు ఆమెని అన్‌పాపులర్ చేశాడు. ఆ తర్వాత చిరంజీవి రాజకీయాలలోకి వచ్చాడు. ఆ సమయంలో చిరంజీవి ఇంటి ఆడపడుచుల గురించి టిడిపి నేతలు ఎంతో దారుణంగా మాట్లాడారు. ఇప్పుడు షర్మిల విషయంలో మరలా అదే పరంపరను కొనసాగిస్తున్నారు. రాజకీయాలలోకి వస్తే ఏమాత్రం సంబంధం లేని ఇంటి ఆడపడుచులను రోడ్డుపైకి లాగారని చిరంజీవి ఎన్నోసార్లు కన్నీరు పెట్టుకున్నాడు. దానికి నేనే సాక్ష్యం. గెలవడం కోసం టిడిపి నాయకులు ఎంత దారుణాలకైనా ఒడిగడతారు.. అని చెప్పుకొచ్చాడు. మరి జగన్.. పవన్ భార్యల సంగతిపై బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ఎంత వరకు సమంజసమో పోసాని ఆలోచించాలి..!