నేడు ఇండస్ట్రీలో అల్లు అరవింద్, డి.సురేష్‌బాబు, మైత్రీ మూవీమేకర్స్, దానయ్య, యువి క్రియేషన్స్, దిల్‌రాజు వంటి నిర్మాతలను, నిర్మాణ సంస్థలను ప్రముఖంగా చెప్పాలి. ఇక దిల్‌రాజు విషయానికి వస్తే ఆయన అండ, ఆయన కాంపౌండ్ నుంచి బయటకు వస్తే సక్సెస్ కావడం ఖాయమని అందరు భావిస్తారు. ఆయన నిర్మాణంలో ఓ చిత్రమైనా చేయాలని భావిస్తారు. ఇక ఈయన కూడా స్టార్స్‌తోనే కాదు.. శర్వానంద్, నితిన్, రామ్, నాని వంటి యంగ్‌స్టార్స్‌తో కూడా మంచి హిట్స్ సాధించాడు.
తాజాగా సంక్రాంతికి వచ్చిన ఆయన చిత్రం ‘ఎఫ్2’ విజయఢంకా మోగిస్తోంది. గత ఏడాది ఆయనకు నిర్మాతగా పెద్దగా కలిసి రాలేదు. అయితే ఈ సంక్రాంతికి ఆయన ‘ఎఫ్2’కి నిర్మాతగానే కాదు.. ‘వినయ విధేయ రామ’కి నైజాం, ఉత్తరాంధ్రలలో పంపిణీ దారునిగా కూడా వ్యవహరించాడు. కానీ ‘వివిఆర్’తో వచ్చిన నష్టాలను ‘ఎఫ్2’తో కవర్ చేసుకోవడం ఖాయమని తేలుతోంది. మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ కెరీర్ బిగినింగ్‌లో ఆయనతో వరుసగా చిత్రాలు తీసి అనతికాలంలోనే తేజు మార్కెట్‌ని 25కోట్లకు పెంచిన ఘనత ఆయనదే. ఇలా కొత్తగా పరిచయం అయ్యే వారసులు కూడా ఆయన ద్వారా పరిచయం కావాలని కోరుకుంటారు. అయితే అక్కినేని నాగచైతన్య విషయంలో మాత్రం ఇది లెక్కతప్పింది.
ఇక మహేష్‌బాబు మేనల్లుడు, సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ కూడా హీరోగా దిల్‌రాజు బేనర్ ద్వారానే పరిచయం కానున్నాడనేది తెలిసిన విషయమే. శశి దర్శకత్వంలో ‘అదే నువ్వు అదే నేను’ అనే టైటిల్‌తో విజయదశమికి ఈ మూవీ ముహూర్తం కూడా జరుపుకుంది. నభానటేష్.. అశోక్‌కి జోడీగా నటించనున్న ఈ మూవీ రేపోమాపో పట్టాలెక్కుతుందని అందరు భావించారు. స్టోరీలైన్ బాగానే ఉన్నా స్క్రిప్ట్ పూర్తి అయిన తర్వాత ఈ స్టోరీ యూత్‌కి కనెక్ట్ అయ్యేలా లేకపోవడం, పూర్తి స్క్రిప్ట్ సంతృప్తికరంగా రాకపోవడంతో ఈ సినిమాని ఆపేస్తున్నట్లు దిల్‌రాజు.. మహేష్‌కి, గల్లా జయదేవ్‌కి సందేశం పంపాడట.
మరో మంచి ప్రాజెక్ట్‌తో అశోక్‌ని ఇంట్రడ్యూస్ చేద్దామని దిల్‌రాజు చెప్పాడని, కానీ అంతకంటే ముందే గల్లాఅశోక్‌ని ఓన్ బేనర్ ద్వారా పరిచయం చేయాలని ఘట్టమనేని ఫ్యామిలీ పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపిల భాగస్వామ్యంలో మహేష్ 25వ చిత్రాన్ని వంశీపైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ మూవీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.