మెగాస్టార్ చిరంజీవి ప్రతి సంక్రాంతిని మెగా కాంపౌండ్‌లోని అందరి మధ్య బెంగుళూరులోని ఫామ్‌హౌస్‌లో గడుపుతారు. ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. ఈ వేడుకకు ఎవరైనా మిస్ అయినా మెగాస్టార్ చాలా బాధపడతాడని అంటున్నారు. కానీ ఈ సంక్రాంతికి మాత్రం ఆయన ‘సైరా..నరసింహారెడ్డి’ కోసం హైదరాబాద్‌లోనే ఉండిపోయాడు. చరణ్ కూడా హైదరాబాద్‌లోనే ఉండగా, పవన్ గుంటూరు, అల్లుఅర్జున్ పాలకొల్లులో సందడి చేశారు. దీనిని బట్టి ‘సైరా..’ చిత్రం కోసం మెగాస్టార్ ఎంతగా కష్టపడుతున్నాడో అర్ధమవుతుంది. అయినా ఇది పూర్తిగా ఏదో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌ని ఉన్నది ఉన్నట్లుగా తీయడం కాకుండా రాఘవేంద్రరావు తరహాలో కొన్ని సినిమాటిక్ అంశాలను కూడా సురేంద్రరెడ్డి పొందుపరిచాడని తెలుస్తోంది. ఈ చిత్రం బడ్జెట్ 200కోట్ల కంటే ఎక్కువేనని, డాడీకి ఇప్పటివరకు ఏ హీరోకి ఇవ్వనంత రెమ్యూనరేషన్ ఇస్తున్నామని చరణ్ చెప్పిన మాటలు మెగాభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి.
ఇక ఇందులో అమితాబ్, జగపతిబాబు, నయనతార, తమన్నా, కిచ్చాసుదీప్, విజయ్‌సేతుపతి వంటి పలు భాషా స్టార్స్ నటిస్తున్నారు. ఇందులోని కీలక సన్నివేశం తర్వాత వెంటనే వచ్చే ఓ పాట కోసం రామోజీ ఫిలింసిటీలో పెద్ద ఎత్తున భారీ సెట్టింగ్స్ వేయనున్నారు. ఇందులో 1000 మంది డ్యాన్సర్లు, 1000కి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటారని సమాచారం. ఇప్పటి వరకు ‘వినయ విధేయ రామ’లో బోయపాటి 500 మంది డ్యాన్సర్లతో చరణ్‌పై పాట తీశాడు. దానికి రెట్టింపు సంఖ్యలో ఇందులో డ్యాన్సర్లతో పాటు జూనియర్ ఆర్టిస్టులు పాల్గొననుండటం ఈ మూవీ ఏ రేంజ్‌లో తీస్తున్నారనే విషయానికి అద్దం పడుతుంది.
ఇక ఇందులో చిత్ర ప్రధాన తారాగణం అంతా పాల్గొంటుందని తెలుస్తోంది. మరోవైపు ఇది ఉయ్యాలవాడ గూడెంలో జరిగే జాతరకి సంబంధించిన పాటా? లేక స్వాతంత్య్ర కాంక్షను రగిలించేలా గతంలో ‘లగాన్’లో వచ్చే తరహా పాటా అనేది తేలాల్సివుంది. అయితే ఇలాంటి హంగుల వల్ల మాత్రమే చిత్రాలు చూస్తారని మాత్రం భావించకూడదు. కథలో దమ్ము, వైవిధ్యం ఉంటేనే ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తున్న తరుణం ఇది. దీనికి ‘వినయ విధేయ రామ’నే ఓ ఉదాహరణ. ఇక ఈ మూవీకి మొదట ఎ.ఆర్.రెహ్మాన్‌ని తీసుకున్నా, ఆ తర్వాత ఆయన దీని నుంచి వైదొలిగాడు. ఇదే సమయంలో శంకర్ కూడా ‘భారతీయుడు 2’కి రెహ్మాన్‌ని పక్కనపెట్టిన నేపధ్యంలో ఇందులోంచి రెహ్మాన్ తప్పుకున్నందుకు బాధపడాల్సిన పనిలేదనే చెప్పాలి.