‘ఆది’ వంటి మొదటి చిత్రంలోనే మాస్ మసాలా దర్శకునిగా తన సత్తా చాటిన దర్శకుడు వి.వి.వినాయక్. ఆ వెంటనే రెండో చిత్రంతోనే ఆయనకు ఏకంగా టాలీవుడ్ సీనియర్‌స్టార్ నందమూరి నటసింహం బాలయ్యని ‘చెన్నకేశవరెడ్డి’గా చూపించే అవకాశం లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించకపోయినా.. అందులో పెద్ద బాలయ్యను పవర్‌ఫుల్‌గా చూపించిన విధానం మెప్పించింది. ఈయన కెరీర్‌లో ‘ఠాగూర్, దిల్, బన్నీ, లక్ష్మీ, కృష్ణ, ఆదుర్స్, నాయక్, ఖైదీనెంబర్ 150’ వంటి విజయాలతో పాటు ‘యోగి, బద్రినాథ్, అఖిల్, ఇంటెలిజెంట్’ వంటి ఫ్లాప్స్ ఉన్నాయి.
ఇక ‘అల్లుడు శీను’ కూడా కమర్షియల్‌గా పెద్దగా విజయం సాధించలేదు. ముఖ్యంగా ‘అఖిల్, ఇంటెలిజెంట్’ చిత్రాల తర్వాత ఈయన కెరీర్ గాడి తప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరోసారి నందమూరి బాలకృష్ణతో రెండోసారి జతకట్టే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఈ మూవీని సి.కళ్యాణ్ నిర్మిస్తాడని కూడా ప్రచారం జరిగింది. మరో వైపు బాలకృష్ణ ప్రస్తుతం ‘మహానాయకుడు’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదలైన వెంటనే ఆయన ‘సింహా, లెజెండ్’ చిత్రాల తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు.
మరోవైపు ఆయన యువ దర్శకుడు ‘పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్’ తాజాగా ‘ఎఫ్2’తో సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ని సొంతం చేసుకున్న అనిల్ రావిపూడికి కూడా ఒకే చెప్పాడని సమాచారం. బాలయ్య కెరీర్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలుగా రూపొందిన ‘నారి నారి నడుమ మురారి’ వంటి ఒకటి రెండు చిత్రాలు తప్పకామెడీని నమ్ముకుని చేసిన చిత్రాలు విజయవంతం అయిన దాఖలాలు లేవు. ఈవీవీ సత్యనారాయణతో ఆయన చేసిన చిత్రాలు కూడా దెబ్బతిన్నాయి. ఇకపోతే బాలయ్య వినాయక్ చిత్రాన్ని హోల్డ్‌లో పెట్టాడని కూడా ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై వినాయక్ స్పందించాడు.
బాలకృష్ణతో నా చిత్రం ఉంటుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని క్లారిటీ ఇచ్చాడు. మరి వినాయక్-బాలయ్యల మూవీ బోయపాటి, అనిల్‌రావిపూడి చిత్రాల తర్వాత ఉంటుందా? బోయపాటి చిత్రం పూర్తయిన వెంటనే ప్రారంభం అవుతుందా? అనేది వేచిచూడాల్సివుంది. బాలయ్యతో వినాయక్ చిత్రం పట్టాలెక్కితే తెలుగులో సీనియర్ స్టార్స్‌గా పేరొందిన చిరంజీవి, బాలకృష్ణలతో రెండేసి చిత్రాలు తీసిన ఘనత వినాయక్‌కి దక్కుతుంది. మరి ఈ అవకాశాన్నైనా వినాయక్ సరిగా సద్వినియోగం చేసుకుంటాడో లేదో వేచిచూడాలి...!