నటనలో ఏది చేసినా జనరంజకంగా, నేచురల్ ఫీల్‌ని మిస్‌కాకుండా ఉండేలా చూసుకోవాలి. నటనలో, హావభావాలలోనే కాదు.... డ్యాన్స్, ఫైట్స్ వంటి వాటిలో కూడా ఏదో స్టెప్సు, ఫైట్స్ ఇరగదీసేస్తున్నామనే ఫీలింగ్ లేకుండా సహజత్వానికి చోటివ్వాలి. సహజత్వానికి దూరమైన పాటలు, యాక్షన్‌సీన్స్‌లో ఇది చాలా ముఖ్యం. ప్రేక్షకుల కోసం కృత్రిమంగా చేస్తున్నామని, కష్టపడిపోతున్నట్లు కనిపించేలా చేస్తే ఫీల్ మిస్ అవుతుంది. ఇదే విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఆ స్థాయిలో వెలిగాడంటే ఆయన ఇచ్చే నేచురల్ ఎక్స్‌ప్రెషన్సే కారణం. ఈ లాజిక్‌ని ‘అఖిల్, హలో’ చిత్రాలలో అక్కినేని చిన్నబ్బాయి అఖిల్ మిస్ అయ్యాడు. ఆయనలో డ్యాన్స్, ఫైట్స్ చేసే మంచి ప్రావీణ్యం ఉన్నా... ఈ రెండు చిత్రాలలో బాగా కృత్రిమత్వం కనిపించింది.
ఇక విషయానికి వస్తే రిపబ్లిక్‌డే కానుకగా అఖిల్ ముచ్చటగా తన మూడో చిత్రంతో లక్‌ని పరీక్షించుకోవడానికి సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన తమన్ ట్యూన్స్ అందరినీ అలరిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ‘చిరు చిరు నవ్వుల’ అనే వీడియో సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. ఈ ఫ్యామిలీ సాంగ్‌కి, పెళ్లి సంబరాలలో వచ్చే పాటగా ఇది ఉంది. కుర్తా, ఫైజమా, చొక్కా ధోవతి, కండువా వంటి డ్రస్‌లలో తెలుగింటి కుర్రాడిగా, మన పక్కింటి అబ్బాయి ఫీలింగ్‌ని అఖిల్ తెచ్చాడనే చెప్పాలి. ఆయన చేసిన డ్యాన్స్ కూడా ఎంతో ముచ్చటగా, ఆకట్టుకుంటోంది.
తన అన్నయ్యకు ‘సవ్యసాచి’తో హిట్ ఇవ్వలేకపోయిన హీరోయిన్ నిధి అగర్వాల్ ఇందులో అఖిల్ సరసన నటిస్తోంది. ఈ సాంగ్ ప్రోమో మొత్తం ఎంతో కలర్‌ఫుల్‌గా, గ్రాండియర్‌గా కనిపిస్తోంది. తన మొదటి చిత్రం ‘తొలిప్రేమ’తోనే సత్తా చాటిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో అదే చిత్ర నిర్మాత భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం వెంకీకి రెండో హిట్‌ని, అఖిల్‌కి తొలి నికార్సయిన హిట్‌ని అందిస్తుందేమో చూడాలి...!