వారసత్వ హీరోలకు చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి. వరుసగా రెండు మూడు చిత్రాలు ఫ్లాప్ అయినా సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు రెడీగా ఉంటారు. పైగా వారసత్వంగా మొదటి చిత్రం నుంచే అభిమానుల ఫాలోయింగ్ ఉంటుంది. ఇక అనుభవం ఉన్న వారి సలహాలు, కనుసన్నలో మంచి చిత్రాల ఎంపిక కొనసాగుతుంది. ఈ వారసత్వ ప్లస్ పాయింట్స్ అన్నీ మెగాస్టార్ తనయుడు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌కి బాగా కలిసి వచ్చాయి. చిరుత తో ఓకే అనిపించుకుని కమర్షియల్‌గా ఫర్వాలేదనిపించుకున్న ఆయన అల్లుఅరవింద్ నిర్మాణంలో రెండో చిత్రమే రాజమౌళితో మగధీర చేసి ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాడు.
ఆ తర్వాత ఒకే తరహా మూస కథలతో వస్తూ వచ్చినా రచ్చ, ఎవడు, నాయక్ ఇలా సేఫ్ ప్రాజెక్ట్ చేశాడు. కానీ ఈయన కెరీర్‌లో జంజీర్(తుఫాన్), ఆరెంజ్, బ్రూస్‌లీ వంటి డిజాస్టర్స్ వచ్చి చేరాయి. వీటితో పాటు గోవిందుడు అందరి వాడేలే వంటి చిత్రాల ఎంపిక వెనక కూడా అల్లుఅరవింద్, చిరంజీవి ఉన్నారు. ఆ తర్వాత రామ్‌చరణ్ కాస్త రూట్ మార్చి కొత్తదనంతో నిండిన దృవ, రంగస్థలం చిత్రాలు చేసి తనలోని నటుడిని పూర్తిగా ఆవిష్కరించాడు. కానీ మరీ ముఖ్యంగా రంగస్థలం చిత్రం సమయంలో అలాంటి పాత్రను, డీగ్లామర్ రోల్‌ని చేయవద్దని చిరు వారించినట్లు వార్తలు వచ్చాయి.
కానీ చరణ్ మాత్రం పట్టుదలతో, సుక్కు మీద ఉన్న నమ్మకంతో ఆ చిత్రం చేశాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత చిరు దీనినిపూర్తిగా చూసి మెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఈ చిత్రం వేడుకలో ఆయన ఆది పినిశెట్టి మరణించినప్పుడు చరణ్ నటన అద్భుతమని ఉదాహరణతో కూడా వెల్లడించాడు. అయితే చిరు మదిలో మాత్రం రంగస్థలం విజయంపై పెద్దగా నమ్మకం లేదనే అంటారు. కానీ అది నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది.మాస్, యాక్షన్ హీరో అయిన రామ్‌చరణ్‌కి రంగస్థలం ఏమాత్రం షాక్ ఇచ్చినా వెంటనే ఫుల్ అవుట్ అవుట్ మాస్‌తో చిత్రం తీసి చరణ్ ఇమేజ్‌ని కాపాడాలనే ఉద్దేశ్యంతోనే చిరు వినయ విధేయ రామ తో బోయపాటికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట.
ఇక ఈ చిత్రం మెయిన్ పాయింట్ మాత్రమే బోయపాటి చిరు, చరణ్‌లకి వినిపించాడని, కానీ కథా విస్తరణ, స్క్రిప్ట్ డెవలప్‌మెంట్ సమయంలోనే అతిశయోక్తితో నిండిన యాక్షన్ సీన్స్, రాంబో లుక్‌లో ఖైదీ గెటప్‌గా చరణ్‌ని చూపించాలనేది కూడా బోయపాటి సొంత నిర్ణయమే అని తెలుస్తోంది. ఇక వినయ విధేయ రామ వేడుకలో చిరంజీవి ఏదో ట్రైలర్, రెండు మూడు యాక్షన్ సీన్స్ చూసి మాత్రమే వేదికపై చరణ్‌ని, బోయపాటిని ఆకాశానికి ఎత్తేసినట్లు కనిపిస్తోంది. మొత్తానికి కథల ఎంపికలో చిరు, మెగా కాంపౌండ్ సలహాలు పక్కనపెట్టి చరణ్ తాను భావిస్తున్న విభిన్న చిత్రాలతో ముందుకు వస్తేనే బెటర్ అని చెప్పాలి.