ఒకనాడు తెలుగులో ఏ హీరోతో నటించాలని ఉంది? అని బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను ఎవరైనా అడిగితే, చిరంజీవి, నాగార్జున పేర్లను ఎక్కువగా చెప్పేవారు. ఆ తర్వాత ఎవరి నోట విన్నా సూపర్‌స్టార్ మహేష్‌బాబు పేరు చెబుతూ వస్తున్నారు. తాజాగా ప్రభాస్, విజయ్ దేవరకొండలు ఈ జాబితాలో చోటుదక్కించుకున్నారు. ఇక విషయానికివస్తే ప్రస్తుతం మహేష్‌బాబు తన ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహర్షి చిత్రం చేస్తున్నాడు. దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపి సంస్థల భాగస్వామ్యంతో ఈ మూవీ రూపొందుతోంది.
మహేష్ కెరీర్‌లో ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకున్న ఈ మూవీని వేసవి కానుకగా ఏప్రిల్‌లో విడుదల చేయనున్నారు. ఇక మహేష్ 26వ చిత్రంగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీమేకర్స్ సంస్థలో చిత్రం చేయడానికి ఓకే చెప్పాడు. అయితే ఇటీవల సుకుమార్ చెప్పిన రెండు మూడు స్టోరీలైన్స్‌కి మహేష్ నో చెప్పాడని వార్తలు వచ్చాయి. అవి తన ఇమేజ్‌కి పనికి రావని, ప్రయోగాలు చేసే ఉద్దేశ్యం తనకు లేదని, తనకి పూర్తిగా సరిపోయే పాత్రలే చేయాలని మహేష్ భావిస్తున్నాడట.
1 (నేనొక్కడినే), బ్రహ్మూెత్సవం, స్పైడర్ వంటి చిత్రాల ఫలితాల నేపధ్యంలో ఈ విషయంలో ఆయన ఎంతో కఠినంగా ఉన్నాడని అంటున్నారు. అందునా ఇప్పటికే ఆయన సుకుమార్‌తో 1 (నేనొక్కడినే) చిత్రం చేసి, ప్రశంసలు దక్కించుకున్నా, కమర్షియల్‌గా భారీ ఫ్లాప్‌ని అందుకున్నాడు. సుక్కు కథల విషయంలో ఏదీ తేలకపోతే మరో దర్శకునితో ముందుకు పోతాడని కూడా అన్నారు. కానీ వాటికి చెక్ చెబుతూ, సుకుమార్ పుట్టినరోజున మహేష్‌బాబు 26వ చిత్రం ఆయనతోనే ఉంటుందని పత్రికా ప్రకటన, నీతో చిత్రం చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ సుక్కుకి మహేష్ సందేశం పంపడం వంటి వాటితో దీనిపై పూర్తిస్థాయి క్లారిటీ వచ్చింది.
ఇక సుక్కు-మహేష్‌ల చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఇప్పటికే కత్రినా వెంకటేష్‌తో మల్లీశ్వరి బాలయ్యతో అల్లరిపిడుగు చిత్రాలలో నటించింది. ఈ ఇద్దరు సీనియర్ స్టార్స్. ఈ చిత్రాలు వచ్చి కూడా ఎన్నో ఏళ్లవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కత్రినాతో మహేష్ జోడీ కడతాడా? అనేది అనుమానమే. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎక్కువగా యంగ్ హీరోయిన్ల వైపే మొగ్గు చూపుతున్నాడు. మరి కత్రినా విషయంలో క్లారిటీ రావాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.