వరస విజయాలతో దూసుకుపోతున్న నేచురల్‌స్టార్ నాని విజయాలకు ‘కృష్ణార్జునయుద్ధం’తో బ్రేక్‌పడింది. ఇక కింగ్ నాగార్జునతో కలిసి నాని నటించిన మల్టీస్టారర్ ‘దేవదాస్’ కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇది ఎవరి ఖాతాలో పడిందనే దానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నానికి పక్కలో బల్లెంగా విజయ్‌దేవరకొండ దూసుకువస్తున్నాడు. దీంతో నానికి తప్పనిసరిగా వరుస హిట్స్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం టీజర్ సంక్రాంతి కానుకగా విడుదలైంది.
లేటు వయసులో ఆటలపై మమకారం పెంచుకుని అత్యంత ఉన్నతస్థాయికి చేరిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. ఉదాహరణకు పాకిస్థాన్ మేటి క్రికెటర్, ప్రస్తుత పాకిస్థాన్‌ని ఏలుతున్న ఇమ్రాన్‌ఖాన్ 15ఏళ్లు దాటిన తర్వాత క్రికెట్ నేర్చుకోవడం మొదలుపెట్టి మొదటి రెండు మూడేళ్లు బ్యాట్స్‌మెన్ కావాలని శ్రమపడి చివరకు బౌలర్‌గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు. ఇలాంటి వారి స్ఫూర్తితో ‘జెర్సీ’ చిత్రం రూపొందినట్లు అర్ధమవుతోంది.
‘నీ ఏజ్ ఇప్పుడు 36 అర్జున్. ప్రొఫెషనల్స్ స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యే ఏజ్ ఇది. పిల్లలని ఆడించే వయసులో మనకు ఆటలెందుకు బావా? ఎంత ప్రయత్నించినా ఇప్పుడు నువ్వేం చేయలేవ్. యూ హ్యాడ్ యువర్‌ఛాన్స్ అండ్ ఇట్స్ వోవర్ నౌ....’ అంటూ నిరుత్సాహపరిచే వ్యక్తులను ఎదురొడ్డి నాని క్రికెటర్‌గా ఎలా రాణించి, సత్తా చూపాడు? అనేది కాన్సెప్ట్‌గా అర్ధమవుతోంది. ‘ఆపేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు గానీ.. ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు’ అనే నాని ఫైనల్ టచ్ డైలాగ్ అద్బుతంగాఉంది.
గతంలో క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో బాలీవుడ్‌లో పలు చిత్రాలు వచ్చాయి. వాటిల్లో ఎక్కువ భాగం బయోపిక్స్. కానీ ‘లగాన్’ చిత్రాన్ని దేశభక్తికి, క్రికెట్‌కి లింక్ చేస్తూ తీశారు. ఇక తెలుగులో ప్రకాష్‌రాజ్ ‘ధోని’ అంతకు ముందు ఎప్పుడో వెంకటేష్ ‘బ్రహ్మరుద్రులు’ వంటి చిత్రాలు వచ్చాయి. మన దేశానికి, రాష్ట్రానికి కూడా రెండే మతాలు ఉన్నాయి. ఒకటి సినిమా, రెండు క్రికెట్. మరి ఈ రెండింటిని ఒకేసారి ప్రయత్నిస్తున్న నాని ‘జెర్సీ’ ఎలా మెప్పిస్తుందో చూడాలి...!