ప్రపంచవ్యాప్తంగా ‘బిగ్‌బాస్’ షోకి ఉన్న ఆదరణ మనకి తెలిసిందే. దీనిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ఏమాత్రం సరిపోని ఈ షో హిందీలో సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత దక్షిణాదిలోకి కూడా ఎంటర్ అయి కన్నడలో అలరించింది. ప్రస్తుతం తమిళం, తెలుగులలో కూడా తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. తమిళం కంటే దీనికి తెలుగులోనే మంచి ఆదరణ లభిస్తుండటం విశేషం. తమిళంలో రెండు సీజన్‌లకు లోకనాయకుడు కమల్‌హాసన్ హోస్ట్‌గా వ్యవహరించగా, తెలుగులో మొదటి సీజన్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా పనిచేసి తన వాక్చాతుర్యంతో అందరినీ మెప్పించాడు. ఇక రెండో సీజన్ అయితే అత్యంత భారీ విజయం సాధించింది. ఇది హోస్టింగ్ చేసిన నేచురల్ స్టార్ నాని వల్ల కాదు. ఇందులో పాల్గొన్న పార్టిసిపెంట్ కౌశల్ వల్ల ఇది సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది.
ఏకంగా లక్షలాది మంది కౌశల్‌కి కనీవినీ ఎరుగని రీతిలో మద్దతుగా నిలిచి, ఈ షోలో కౌశల్‌పై ఈగ వాలకుండా గెలిపించుకున్నారు. కౌశల్ ఆర్మీనే బిగ్‌బాస్ సీజన్2ని శాసించి, విజేతను నిర్ణయించింది అనడంలో సందేహం లేదు. ఒక్కసారిగా అందరు కౌశల్ వంటి సాదాసీదా నటునికి లభించిన మద్దతు చూసి ముక్కున వేలేసుకున్నారు. ఇప్పటివరకు ప్రపంచంలోనే ఏ షోలో ఏ పార్టిసిపెంట్‌కి ఇంత మద్దతు రాలేదని విశ్లేషకులు అన్నారు. ఇక బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చేసిన వారికి సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తూ ఉంటాయి. ఇలా పలు భాషల్లో ఎందరో కొత్తవారు బిగ్‌బాస్ ద్వారా వెండితెరకి పరిచయం అయ్యారు.
అదే తెలుగు విషయానికి వస్తే పవన్ అభిమానుల మద్దతుతో గెలిచాడని పేరు తెచ్చుకున్న సీజన్1 విజేత శివబాలాజీ దీనిని వెండితెరపై అవకాశాల విషయంలో సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మరి కౌశల్ పరిస్థితి ఏమిటి? కౌశల్ గతంలోబుల్లితెరపైనే కాదు వెండితెరపై కూడా చిన్న చిన్న పాత్రలు చేశాడు. హీరోగా రాణించడమే తన ధ్యేయమని ప్రకటించాడు. మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’లో నటిస్తున్నాడని కూడా కొంత కాలం కిందట వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన హీరోగా తెరంగేట్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఓ యువదర్శకుని చిత్రంతో ఈయన హీరోగా నటిస్తున్నాడట. మెగాఫ్యామిలీకీ ఎంతగానో సాన్నిహిత్యం ఉన్న నిర్మాత ఈ మూవీని తెరకెక్కిస్తాడని, టైటిల్‌గా ‘సేనాని’ అని ఖరారు చేశారని సమాచారం. ఈ చిత్రంలో సమకాలీన రాజకీయాలలో జనసేనాని పవన్ ప్రాధాన్యతను తెలిపే స్ఫూర్తితో ఈ మూవీ తెరకెక్కనుందని అంటున్నారు. మరి ఇప్పటికైనా కౌశల్ బిగ్‌బాస్ విజేతగా నిలవడానికి కారణమైన అభిమానులు ఏ స్టార్‌కి చెందిన వారో అర్ధమవుతుంది. మరి శివబాలాజీ సాధించలేదని కౌశల్ హీరోగా నిలబడి మెప్పిస్తాడా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది..!