అనుకున్నామని జరగవు అన్ని.. అనుకోలేదని ఆగవు కొన్ని.. జరిగేవన్నీ మంచివని అనుకోవడమే మనిషి పని.. అని ఓ మహాకవి చెప్పిన మాటలు అక్షరసత్యాలు. ఇక విషయానికి వస్తే దర్శకునిగా ఈవీవీ సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులోని టాప్‌స్టార్స్ అందరితో ఎన్నో బ్లాక్‌బస్టర్స్ అందించాడు. పవన్‌కళ్యాణ్ వంటి వారిని తెలుగు తెరకు పరిచయం చేశాడు. కామెడీ పండించడంలో తన గురువు జంధ్యాల తర్వాత తానేనని నిరూపించుకున్నాడు. అంతేకాదు.. మధ్యమధ్యలో తనదైన ఎంటర్‌టైన్‌మెంట్‌ని మిస్ కాకుండానే ‘ఆమె’ వంటి చిత్రాలను అత్యద్భుతంగా తీశాడు. ఆయన ద్వారా నిర్మాతలుగా స్థిరపడిన వారెందరో ఉన్నారు.
ఇక ఆయన తనయులైన ఆర్యన్‌రాజేష్, అల్లరినరేష్‌లు కూడా హీరోలుగా పరిచయం అయ్యారు. ఈవీవీ బతికున్న రోజుల్లో తన పెద్దకుమారుడు ఆర్యన్‌రాజేష్‌ని హీరోని చేయాలని, అల్లరినరేష్‌ని నిర్మాతను చేయాలని అనుకున్నాడు. 2002లో తనను దర్శకునిగా ప్రోత్సహించిన డి.రామానాయుడు బేనర్‌లోనే ఆర్యన్‌రాజేష్‌ని హీరోగా పరిచయం చేస్తూ ‘హాయ్’ చిత్రం తీశాడు. ఆ తర్వాత శ్రీనువైట్లతో ‘సొంతం’తో పాటు ఆయన తమిళ చిత్రాలలో కూడా నటించాడు. కానీ దేవిప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ‘లీలామహల్‌సెంటర్’, ఈవీవీ తీసిన ‘ఎవడి గోల వాడిది’ తప్ప ఈయనకు హీరోగా మరో హిట్ లేదు. అదే సమయంలో అనూహ్యంగా అల్లరినరేష్ మాత్రం రాజేంద్రప్రసాద్ వంటి కామెడీకింగ్‌ని భర్తీ చేస్తూ కామెడీ హీరోగా తన సత్తా చాటాడు. కానీ తండ్రి ఆకస్మిక మరణం తర్వాత అల్లరినరేష్ కెరీర్ కూడా ఇబ్బందుల్లో పడింది. తండ్రి మరణంతో వీరికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. అలాంటి సమయంలో ఆర్యన్‌రాజేష్ నిర్మాతగా మారి తమ్ముడితో ‘బందిపోటు’ చిత్రం నిర్మించి నిర్మాతగా కూడా ఫెయిల్ అయ్యాడు.
ఇక ప్రస్తుతం ఆర్యన్‌రాజేష్, రామ్‌చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా విడుదల అయిన ‘వినయ విధేయ రామ’లో చరణ్‌కి అన్నయ్యగా జీన్స్ ప్రశాంత్‌తో కలిసి నటించాడు. గతంలో హీరోగా ఫేడవుట్ అయిన జగపతిబాబుని విలన్‌గా బిజీ చేసి, ఆది పినిశెట్టికి తెలుగులో మరలా ఓ గుర్తింపు తెచ్చిన బోయపాటి ఈ చిత్రం ద్వారా ఆర్యన్‌ని క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ చేస్తాడేమో వేచిచూడాలి...!
మరోవైపు అల్లరినరేష్ కూడా మహేష్‌బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రం, వంశీపైడిపల్లి, దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపిలు తీస్తున్న ‘మహర్షి’లో సపోర్టింగ్ రోల్ చేస్తున్నాడు. తమ తండ్రి మరణించిన తర్వాత తమకు పెద్ద దిక్కు లేకుండా పోయిందని, దాంతో నిర్మాతగా కూడా దెబ్బతిన్నానని, కానీ రాబోయే రోజుల్లో మరలా ఈవీవీ బేనర్ ద్వారా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు తీస్తామని, తమ తండ్రి ద్వారా లాభపడిన పలువురు నిర్మాతలు ఉన్నా.. వారు తమని హీరోగా పెట్టుకునేందుకు ముందుకు రాలేదని, దానిలో ఏమాత్రం తప్పులేదని ఆర్యన్ రాజేష్ చెప్పుకొచ్చాడు. ఏ నిర్మాత అయినా మార్కెట్ ఉన్న హీరోతోనే చిత్రం చేయాలని భావిస్తాడంటూ చెప్పుకొచ్చాడు.
కాగా ప్రస్తుతం ఆర్యన్‌రాజేష్ తనకు బాగా పరిచయం ఉన్న దర్శకులను కలసి క్యారెక్టర్ రోల్స్‌ని అడుగుతున్నాడని సమాచారం. ఇప్పటికే శ్రీనువైట్లని ఆయన కలిశాడట. మరి ‘వినయ విధేయ రామ, మహర్షి’లతో అయినా ఈ ఇద్దరి కెరీర్‌లో మరలా బిజీ అవుతాయేమో వేచిచూడాల్సివుంది...!