సినిమా అనేది సృజనాత్మకమైన కళ. ఇందులో పూర్తి స్వాతంత్య్రం, ఎలాంటి ఒత్తిడులు లేకపోతేనే వాస్తవాలు ఎదురు చూస్తాయి. జీవత చరిత్రలు, మీడియాలతో సమానమైన బలమైన మాధ్యమం సినిమా అని ఒప్పుకుని తీరాలి. కానీ ఓ వ్యక్తి బయోపిక్‌లో నిజానిజాలను చూపించందే అది పూర్తి స్థాయి బయోపిక్ అనిపించుకోదు. ప్రస్తుతం మన దేశంలో ప్రతి భాషల్లోనూ బయోపిక్‌ల హవా నడుస్తోంది. తెలుగులో ‘మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంధం, సై..రా..నరసింహారెడ్డి, యాత్ర’ ఇలా ఎన్నింటినో చెప్పుకోవచ్చు.
ఇక బాలీవుడ్‌లో అయితే ఈ ట్రెండ్ ఎప్పుడో మొదలైంది. కాగా ప్రస్తుతం అక్కడ యూపీఏ హయాంలో ప్రధానమంత్రిగా పనిచేసిన ఆర్దిక రంగ నిపుణుడు, వివాదాలే లేని అజాతశత్రువు డాక్టర్ మన్మోహన్‌సింగ్‌పై ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే బయోపిక్ రూపొందుతోంది. ఇందులో మన్మోహన్‌సింగ్‌గా దేశం గర్వించదగ్గ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్నాడు. నాడు మన్మోహన్‌కి మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారువా రాసిన పుస్తకం ఆధారంగా ఇది రూపొందుతోంది. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో ‘నాకైతే డాక్టర్‌సింగ్ ఎలాంటి లోపాలు లేని భీష్మాచార్యునిగా కనిపిస్తాడు. పాపం ఫ్యామిలీ డ్రామాకి బలైపోయారు.. మహాభారతంలో రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి. కానీ ఇండియాలో ఒకే ఫ్యామిలీ’ అంటూ గాంధీ కుటుంబంపై వేసిన సెటైర్లు బాగా ఆకట్టుకుంటున్నాయి.
ప్రైమ్ మినిస్టర్ ఏమి చేయాలో ఎంబసీనా నిర్ణయించేది?’ ఇలా మన్మోహన్ కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో సోనియా మోక్కాలడ్డిన తీరు, దానికి మన్మోహన్ పడిన ఆవేదన, రాహుల్‌ని ప్రధానిని ఎప్పుడు చేయాలి? అందుకోసం మన్మోహన్‌సింగ్‌ని ఎలా పదవి నుంచి తప్పించాలి? అనే కుయుక్తులను ఇందులో పొందుపరిచినట్లు అర్ధమవుతోంది. ఈ చిత్రం తీయడంలో ఎలాంటి తప్పిందం లేదు. నిజానికి ఇలాంటి వాస్తవాలను చూపే బయోపిక్‌లు వస్తున్నందుకు మనం గర్వపడాలి.
కానీ అదే సమయంలో ప్రస్తుత ప్రధాని మోదీ జీవితంపై కూడా బయోపిక్ రూపొందుతోంది. మరి ఇందులో పెద్దనోట్ల రద్దు విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు.... బ్యాంకులపై ప్రజలకు నమ్మకం పోయేలా చేసిన విధానం, రాఫెల్, అంబానీలు, నీరవ్‌మోదీల వంటి వారికి మద్దతుగా నిలిచిన మోదీ-అమిత్‌షాల తప్పుడు, మోసపూరితమైన నిర్ణయాలను కూడా అంతే వాస్తవంగా చూపిస్తే సెన్సార్ వారు సర్టిఫికేట్ ఇస్తారా? అనేది ఆలోచించాల్సిన విషయం. ఇక ఎన్నికల వేళ మన్మోహన్ బయోపిక్ విడుదల కానుండటం కూడా అనుమానాలకు తావిస్తోంది. దీనిపై పలువురు కాంగ్రెస్ నాయకులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. మరి న్యాయస్థానాలు ఈ విషయంలో ఎలాంటి తీర్పుని ఇస్తాయో వేచిచూడాల్సివుంది....!