అక్కినేని ఫ్యామిలీ కాంపౌండ్ నుంచి హీరో అయ్యాడు. నటనలో, హీరోలకు ఉండే లక్షణాలలో అన్ని ఉన్నాయి. కానీ ఆయన సక్సెస్‌కి ఇవేమీ సహాయపడలేకపోయాయి. ఒక్కసారి హీరో సుమంత్‌ని చూసి అయ్యో అనిపిస్తుంది. తన కెరీర్‌ని రాంగోపాల్‌వర్మ ‘ప్రేమకథ’తో స్టార్ చేసిన ఆయనకు నాగార్జున అండగా నిలిచి ‘స్నేహమంటే ఇదేరా’ చేసినా అది ‘త్యాగమంటే ఇదేరా’ అన్నట్లు పనికి రాకుండా పోయింది. ఈయన కెరీర్‌లో చెప్పుకోదగిన చిత్రాలంటే ‘సత్యం, గౌరీ, గోదావరి’ వంటి అతి కొద్ది మాత్రమే మిగిలాయి. అభిరుచి కలిగిన చిత్రాలు చేస్తున్నా సక్సెస్, ఇమేజ్ మాత్రం ఆయన దరి చేరడం లేదు.
తాజాగా ఎన్టీఆర్ బయోపిక్‌గా క్రిష్ దర్శకత్వంలో బాలయ్య సొంతంగా నిర్మిస్తున్న ‘కథానాయకుడు’లో ఆయన తన తాతయ్య ఏయన్నార్‌గా కనిపించనున్నాడు. ఈ లుక్‌కి ఇప్పటికే వెంకటేష్ నుంచి ఎందరి నుంచో ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక ‘గోల్కోండ హైస్కూల్’ నుంచి ‘నరుడా.. డోనరుడా’ వరకు ఆయన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. శ్రీహరిని, అనుష్కని పెట్టుకుని చేసిన ‘మహానంది’ కూడా ఆయన కోరికను తీర్చలేదు కానీ ఇటీవల వచ్చిన ‘మళ్లీరావా’ చిత్రం ఓకే అనిపించింది.
తాజాగా ఆయన ట్రైలర్‌తో ఆసక్తిని రేపిన ‘ఇదంజగత్’ కూడా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో తెలియదు. ‘సుబ్రహ్మణ్యపురం, ఇదంజగత్’లు పెద్దగా గ్యాప్ లేకుండా వెనువెంటనే విడుదల కావడం కూడా దీనికి కారణం. ‘సుబ్రహ్మణ్యపురం’ కమర్షియల్‌గా జస్ట్ ఓకే అనిపించినా ‘ఇదంజగత్’ బాగా నిరాశపరిచింది.
తాజాగా ఈయన మాట్లాడుతూ, ‘మళ్లీరావా’ చిత్రం కంటే ముందే ‘ఇదంజగత్’ని ప్రారంభించాం. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అయింది. విడుదల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోలేకపోయాం. సినిమా విడుదల సమయంలో సరైన ప్రమోషన్ ద్వారా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లలేకపోవడం మా తప్పే. ఇక నుంచి ఈ విషయంలో జాగ్రత్తపడతాను అని చెప్పుకొచ్చాడు. నేటి రోజుల్లో పావలా కోడికి ముప్పావలా మసాలా అన్నట్లుగా ప్రమోషన్స్ ప్రాధాన్యత పెరిగిన విషయాన్ని ఇప్పటికైనా సుమంత్ గుర్తించినందుకు సంతోషమే.
ఈ గుణపాఠం వల్ల భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటాడని ఆశిద్దాం. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. సుశాంత్ కంటే ఎన్నో విధాల సుమంతే బెటర్ అనేది మాత్రం వాస్తవం.