కాస్టింగ్‌కౌచ్, వర్మ, మధ్యలో మా అసోసియేషన్‌లో శివాజీరాజా, సీనియర్ నరేష్‌ల మధ్య స్పర్థలు.. ఇలా రోజుకో వివాదం లేనిదే తెలుగు చిత్ర పరిశ్రమకు నిద్రపట్టదు. ఇక కొంతకాలం కిందట పైరసీ అంటూ హడావుడి, తమ చిత్రాలు విడుదలైనప్పుడే పైరసీ గుర్తుకు వచ్చే పెద్దలు మన వద్ద చాలా మందే ఉన్నారు. ఇంకాస్త ముందుకు వెళ్తే ‘ఆ..నలుగురు’ అనే మాట విని మరలా చాలా కాలం అయిందే అనుకున్నంతలో మరోసారి ‘ఆ..నలుగురు’ సీన్ రిపీట్ అయింది. దీనికి రజనీకాంత్ నటించిన ‘పేట’ వేదిక కావడం విశేషం. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న వల్లభనేని అశోక్‌తో పాటు నిర్మాతల మండలి మాజీ ప్రధాన కార్యదర్శి, ఎప్పుడు నందమూరి భజన చేస్తూ, అప్పుడప్పుడు తారకరత్న వంటి వారి చిత్రాలలో పేర్లు వేయించుకునే పనీపాటాలేని తుమ్మల ప్రసన్నలు ఇప్పుడు ఈ వేడిని మరలా రాజేశారు.
అయినా గతంలో వల్లభనేని అశోక్ తెలుగులో విడుదల చేసిన రెండు డబ్బింగ్ చిత్రాలైన ‘నవాబ్, సర్కార్’ విషయంలో లేని నొప్పి ఆయనకు తాజాగా ‘పేట’ ద్వారా తెలిసింది. తమ చిత్రానికి థియేటర్లు దొరకకుండా చేస్తున్నారని, సినీ మాఫియా ఆ ఇద్దరు ముగ్గురి చేతిలోనే బందీగా మారి మాఫియాను మించి ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఇక్కడ రజనీకాంత్ పేటకి థియేటర్లు దొరకకపోవడం కాస్త బాధాకరమే. ఈ విషయంలో నిర్మాత వల్లభనేని అశోక్, టి.ప్రసన్నకుమార్‌ల ఆవేదనను అందరు అర్ధం చేసుకుంటారు. ప్రసన్న చెప్పినట్లు సంక్రాంతికి ఆరేడు సినిమాలు విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రాలు కూడా ఉన్నాయి.
కానీ నాటి పరిస్థితులు వేరు.. నేటి పరిస్థితులు వేరు. ఎందుకంటే నేడు ప్రతి ఒక్కరు పూర్తిగా లాంగ్‌రన్ మీద కాకుండా ఓపెనింగ్స్‌మీదనే ఆధారపడుతున్నారు. ఇక ప్రసన్న మరో అడుగు ముందుకేసి ‘కథానాయకుడు, పేట’ చిత్రాలు మాత్రమే సంక్రాంతికి నిలబడతాయని, మిగిలిన రెండు చిత్రాలు చావు దెబ్బతింటాయంటూ మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే ఈసారి సంక్రాంతికి ‘వినయ విధేయ రామ, ఎఫ్ 2’లతో పాటు థియేటర్లను భారీగానే కబళిస్తున్న చిత్రం ‘కథానాయకుడు’. మరి ఆ లెక్కన బాలయ్య కూడా ఈ విషయంలో తనవంతు అన్యాయం చేస్తున్నాడు. కానీ ప్రసన్న మాత్రం ఆ రెండు చిత్రాలనే టార్గెట్ చేసి ‘పేట’ ముసుగులో ‘కథానాయకుడు’కి మద్దతు తెలపడం మాత్రం అసలైన అన్యాయాన్ని పక్క దారి పట్టించడమే అవుతుందని చెప్పాలి.