స్వర్గీయ నందమూరి తారకరామారావు నటునిగానే కాదు.. నిర్మాతగా, దర్శకునిగా, రాజకీయ నాయకునిగా, అద్భుతమైన వక్తగా, పురాణాలు, వేదాలు ఔపోసన పట్టిన వ్యక్తిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు. ఇక స్వయాన ఎన్టీఆర్ తన సినీ, రాజకీయ రంగ వారసునిగా బాలయ్యను ప్రకటించాడు. బాలయ్య కూడా నటునిగా, సినిమాలలో అద్భుతంగా డైలాగ్స్ చెప్పే కంప్లీట్ యాక్టర్‌నని ప్రూవ్ చేసుకున్నాడు. ‘భైరవద్వీపం, కృష్ణార్జున విజయం, పాండురంగడు, ఆదిత్య369, గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిత్రాల ద్వారా తనని మించిన నటులు నేటి తరంలో లేరని తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.
ఇక ఇటీవల రాజకీయ నాయకునిగా మారి, హిందుపురం ఎమ్మెల్యేగా ఉన్నాడు. కానీ సభలలో మాత్రం ఆయన ప్రసంగాలు ఎన్టీఆర్ కాలి గోటికి సరిపోవు అనే చెప్పాలి. మరోవైపు తండ్రిలా తాను కూడా ఎన్టీఆర్ బయోపిక్‌తో నిర్మాతగా అవతారం ఎత్తాడు. ‘నర్తనశాల’తో దర్శకుడిగా అరంగేట్రం ఇవ్వాలని భావించాడు. కానీ ఆకస్మిక కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడంతో ఆయన మరలా దర్శకత్వం వైపు తలెత్తి చూడలేదు. కానీ త్వరలోనే ఆయన డైరెక్టర్ అవతారం ఎత్తడం ఖాయమనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. బహుశా నందమూరి మోక్షజ్ఞతో సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం అవుతాడా? అనే చర్చ కూడా సాగుతోంది. అయితే బాలయ్యకు దర్శకునిగా కొంత అనుభవం తాజా ‘కథానాయకుడు, మహానాయకుడు’ ల ద్వారా వచ్చిందని అర్ధమవుతోంది. వాస్తవానికి శతాధిక చిత్రాల అనుభవం ఉన్న ఆయనకు దర్శకత్వం పెద్దగా కష్టం కాదు.
కానీ దానికి ఫ్లాట్‌ఫాం మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా వచ్చిందని తాజాగా స్పష్టం అవుతోంది. తాజా ఇంటర్వ్యూలో తన తండ్రి హరికృష్ణ ఎలా ఉండేవారో బాలయ్య బాబాయే చూపించాడని కళ్యాణ్‌రామ్, తన తాతయ్య ఏయన్నార్ ఎలా చేసే వారో చెప్పింది బాలయ్యేనని సుమంత్.. చంద్రబాబునాయుడు ఎలా వ్యవహరిస్తారో చూపింది బాలయ్యేనని రానా.. ఇలా అందరు బాలయ్యబాబుని ఆకాశానికి ఎత్తేశారు.
ఇక బాలయ్య సైతం తాను కూడా కొంత పార్ట్‌ని డైరెక్ట్ చేయాల్సివచ్చిందని ఒప్పుకోవడం కొసమెరుపు. ఇలా బాలయ్య మధ్యలో ఇంటర్‌ఫియర్ కావడం వల్లే తేజ ఈ చిత్రం నుంచి దర్శకునిగా వైదొలిగాడని వచ్చిన వార్తలకు ఇది బలం ఇస్తోంది. సామాన్యంగా దర్శకుని వ్యవహారాలలో అసలు జోక్యం చేసుకోడని మంచి పేరున్న బాలయ్య ఈసారి మాత్రం కాస్త అందులో తలదూర్చాడనే అర్ధమవుతోంది. మరి ఈ ఎక్స్‌పీరియన్స్ బాలయ్య ఫుల్‌ప్లెజ్డ్‌డ్ డైరెక్టర్‌గా మారే ముందు రిహాల్సర్‌లా ఉపయోగపడి ఉంటుందనే మాట బలంగా వినిపిస్తోంది.