చిన్న సినిమాలకు థియేటర్లు దొరక్కుండా చేస్తున్నారు, ఆ నలుగురు చిత్రసీమను శాసిస్తున్నారు, చిన్న సినిమాలను తోక్కేస్తున్నారు వంటి స్టేట్మెంట్స్ ను ఇప్పటికే చాలా మంది ఇచ్చారు. కానీ.. ఆ నలుగురు ఎవరు అనేది మాత్రం చెప్పే ధైర్యం చేయలేదు. ఆ నలుగురు దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, రామోజీరావు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ.. ఎవరూ ఆ పేర్లు పైకి చెప్పే ధైర్యం చేయరు.. అందుకు చాలా కారణాలు ఉండొచ్చు. అయితే.. ఈ నలుగురిపై ఈ తరహా స్టేట్మెంట్స్ వినిపించి చాలా రోజులవుతోంది. ఈమధ్యకాలంలో ఎవరూ ఆ నలుగురిని టార్గెట్ చేసింది లేదు. కానీ.. నిన్న రాత్రి జరిగిన పెట్ట ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వల్లభనేని అశోక్ మాత్రం నిప్పులుగక్కాడు. ముఖ్యంగా దిల్ రాజు, అల్లు అరవింద్ ల మీద విరుచుకుపడ్డాడు.
అల్లు అరవింద్, దిల్ రాజులు ఏమైనా పుట్టేటప్పుడు థియేటర్లతో పుట్టారా.. ఈ థియేటర్ మాఫియా ఏంటీ.. నయూమ్ లాంటి కిరాతకుడ్ని చంపేసి ప్రజలకు న్యాయం చేసిన కే.సి.ఆర్ ప్రభుత్వం దిల్ రాజు, అల్లు అరవింద్ లను కూడా షూట్ చేసి చంపి థియేటర్ కష్టాలను తీర్చాలని వల్లభనేని అశోక్ పేర్కొన్నాడు. ఇంకాస్త దిగజారి వారిద్దరినీ కుక్కలు అని పేర్కొనడం అనేది హేయమైన పద్ధతి.
అయినా.. డబ్బింగ్ సినిమాలకు థియేటర్లకు ఇవ్వడం లేదని అశోక్ నీలగడం ఏంటో ఇండస్ట్రీ వర్గాలకు అర్ధం కాలేదు. మామూలుగానే డబ్బింగ్ సినిమాలకు తక్కువ థియేటర్లు ఇవ్వమని రూల్ ఉంది. అలాంటిది పండుగ సందర్భంలో మూడు భారీ స్ట్రయిట్ సినిమాలు తలపడుతున్న తరుణంలో ఇలా డబ్బింగ్ సినిమాకి థియేటర్లు ఇవ్వలేదని ఇండస్ట్రీలోని బడా నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్స్ ను కుక్కలు అని తిట్టడం అనేది కేవలం హైలైట్ అవ్వడం కోసం చేసిన చీప్ ట్రిక్ గా తప్ప మరే విధంగానూ కనిపించడం లేదు. మరి ఎవరి సపోర్ట్ చూసుకొని వల్లభనేని అశోక్ ఇలా రెచ్చిపోయాడు అనేది తెలియాల్సి ఉంది.