సందీప్‌రెడ్డి వంగా.. 2017లో `అర్జున్‌రెడ్డి` చిత్రంతో ఇతను సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. పాత్ బ్రేకింగ్ సినిమాని అందించి ఒక విధంగా అప్పటి వరకు వున్న తెలుగు సినిమా గమనాన్ని మార్చేశాడు. ఒక్కాసారిగా టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యాడు. `అర్జున్‌రెడ్డి` చూసిన తరువాత సందీప్‌రెడ్డి వంగాతో ఒక్క సినిమా అయినా కలిసి పనిచేయాలని ఆలోచించని స్టార్ హీరో లేరంటే అది అతిశయోక్తిగా అనిపిస్తుందేమో కానీ ఇది మాత్రం అక్షర సత్యం. సోషల్ మీడియా వేదికపై సందీప్ వంగా దర్శకత్వ ప్రతిభను మహేష్‌బాబు, రామ్‌చరణ్..ఇలా చాలా మంది స్టార్ హీరోలు కొనియాడారు.
ఇదే చిత్రాన్ని ప్రస్తుతం సందీప్ వంగా బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నాడు. షాహీద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా `కబీర్‌సింగ్` పేరుతో రూపొందుతోంది. దీని తరువాత తెలుగులో బిగ్ స్టార్‌తో `అర్జున్‌రెడ్డి`ని మించిన సినిమా చేయాలని చాలా ఆత్రుతగా వున్నాడు సందీప్. అతని కోసం చాలా మంది ఎదురుచూస్తున్నా తను మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ఎంచుకున్నట్లు తాజాగా తెలిసింది. ఇటీవలే సందీప్ వంగా ఎన్టీఆర్‌ని కలిసి ఓ స్క్రిప్ట్ వినిపించాడట. అది ఆయనకు ఎంతగానో నచ్చిందని, ఇద్దరు కలిసి త్వరలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది.
సందీప్‌రెడ్డి వంగా ప్రస్తుతం `అర్జురెడ్డి` రీమేక్ పనుల్లో బిజీగా వున్నాడు. ఎన్టీఆర్ కూడా రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తరువాతే సందీప్ వంగా చిత్రాన్నితెరపైకి తీసుకురావాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. `అర్జున్‌రెడ్డి` తరువాత సందీప్‌రెడ్డి వంగా నుంచి సినిమా అంటే అంచనాలు భారీగా వుంటాయి. అందున ఎన్టీఆర్ కాంబినేషన్‌లో అంటే అంచనాలను అందుకోవడం కష్టమే. ఈ విషయంలో సందీప్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో? తన రెండవ సినిమాగా ఎలాంటి కథని తెరపైకి తీసుకొస్తాడో చూడాలి.