సంక్రాంతి పోరు మహా రంజుగా మారింది. జనవరి 9న ‘కథానాయకుడు’, 10న ‘పేట’, 11న ‘వినయ విధేయ రామ’, 12న ‘ఎఫ్2’లు రిలీజ్ కానున్నాయి. ఈ సందర్భంగా ‘వినయ విధేయ రామ’, ‘పేట’ చిత్రాలు పవర్‌ఫుల్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌గా కనిపిస్తుంటే, ‘కథానాయకుడు’ ఎన్టీఆర్ బయోపిక్.. అందునా ‘బాలయ్య-క్రిష్’ కాంబినేషన్‌లో వస్తోంది కాబట్టి దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు ట్రైలర్‌తోనే ‘ఎఫ్2’ చిత్రం కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. ఇలాంటి సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్‌ని ‘ఎఫ్2’కే కట్టబెట్టకుండా, తమ చిత్రంలో కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయనే చెప్పే ప్రయత్నంలో బోయపాటి బిజీగా ఉన్నాడు.
‘తందానే.. తందానే’ అనే ఫ్యామిలీ సాంగ్ ప్రోమోలతో పాటు హీరోయిన్ కియారా అద్వానా పాదాలను వినయ విధేయ రాముడు తన భుజాలపై పెట్టుకున్న పోస్టర్ విడుదల కూడా అందులో భాగమే. ఇక ‘రంగస్థలం’ వల్ల వచ్చిన క్రేజో లేక మాస్ అండ్ యాక్షన్ చిత్రాలను తెలుగువారు సంక్రాంతి సీజన్‌లో మరీ ముఖ్యంగా బి, సి సెంటర్లలో బాగా చూస్తారనే కారణం వల్లనో గానీ ఈ చిత్రం థియేట్రికల్ ప్రీరిలీజ్ ఏకంగా 94కోట్లు దాటిందని అంటున్నారు. సినిమా బ్లాక్‌బస్టర్ కాకపోతే ఇంత తిరిగి రాబట్టడం అసాధ్యం. ప్రీరిలీజ్ థియేట్రికల్ రైట్స్ అత్యంత అధికమైన రేటుకి అమ్ముడుపోయిన చిత్రాలలో ‘బాహుబలి- ది బిగినింగ్, బాహుబలి-ది కన్‌క్లూజన్, అజ్ఞాతవాసి, భరత్ అనే నేను’ తర్వాత ఐదో స్థానంలో ‘వినయ విధేయ రామ’ నిలిచాడు.
ఇక ఈ చిత్రం గురించి చిరంజీవి బాగా బూస్టప్ ఇస్తున్నాడు. వాస్తవానికి అల్లుఅర్జున్‌కి ‘సరైనోడు’ వంటి అనూహ్యమైన బ్లాక్‌బస్టర్ ఇచ్చిన బోయపాటితో చిరు 151వ చిత్రం చేయనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ అది పట్టాలెక్కకపోయినా ఆ లోటును ప్రస్తుతం తనయుడు రామ్‌చరణ్ తీరుస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ చెప్పిన డైలాగ్‌లు, నటన చూసి తానెంతో జెలసీగా ఫీలయ్యానని మెగాస్టార్ చెబుతూ, అందులోని కొన్ని డైలాగ్‌లను కూడా చెప్పిన సంగతి తెలిసిందే. మరి చిరు బూస్టప్ బోయపాటి-చరణ్‌లకు చిరు చిత్రం స్థానంలో లోటు తీరుస్తుందో లేదో వేచిచూడాల్సివుంది...!