ప్రస్తుతం దేశవ్యాప్తంగా బయోపిక్‌లు ఊపందుకుంటున్నాయి. ఈ పరిణామం టాలీవుడ్‌ని కూడా తాకింది. ‘మహానటి’తో సావిత్రి, రాబోయే ‘కథానాయకుడు, మహానాయకుడు’ ద్వారా ఎన్టీఆర్ బయోపిక్‌లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ‘మహానటి’లో కాస్త వాస్తవాలను చూపించినా, ఎమోషన్స్‌కే పెద్ద పీట వేశారు గానీ జెమినీ గణేషన్‌తో పాటు సావిత్రిని చివరి కాలంలో దారుణంగా చూసిన ది గ్రేట్ యాక్టర్స్‌ని, అందునా తెలుగు స్టార్స్‌ని మాత్రం వదిలేశారు.
ఇక ఎన్టీఆర్ బయోపిక్‌గా ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్న చిత్రాలలో కూడా వివాదాల శాతం ఏమీ ఉండదనే తెలుస్తోంది. ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ద్వారా మాత్రం వర్మ గుబులు రేపుతున్నాడు. అయితే నేడున్న కఠిన నిబంధన వల్ల ఈ బయోపిక్‌లో ఆయన నిజాలు చూపిస్తాడా? చూపినా అవి బయటకు వచ్చి థియేటర్లలో తెరపై కనిపిస్తాయా? అనేది అనుమానమే. ఎందుకంటే ఇటీవల ఎవరి బయోపిక్ రూపొందిస్తున్నా దానికి బతికున్న వ్యక్తి అయితే వారి అనుమతి, వారు మరణించి ఉంటే వారి వారసుల అనుమతి తప్పనిసరి అన్నట్లుగా నిబంధనలు ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి లక్ష్మీపార్వతి నుంచి తిప్పలు ఉండకపోయినా చంద్రబాబు వంటి వారు మాత్రం శాంతిభద్రతల సమస్యగా సినిమాని విడుదల చేయనిస్తారా? లేదా అనేది చూడాలి. ఇక తమిళంలో జయలలిత మీద రెండు సినిమాలు తెరకెక్కనున్నాయి. వీటిలో జయ మరణం విషయంలో ఉన్న వివాదాలపై క్లారిటీ ఇస్తారా? వాటిని చూపిస్తారా? అనేవి వేచిచూడాల్సివుంది.
ఇక ప్రస్తుతం దేశ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మీద అనుపమ్‌ఖేర్ నటిస్తోన్న బయోపిక్ రూపొందుతోంది. ఇక త్వరలో ప్రధాని నరేంద్రమోదీ.. ఛాయ్ వాలా నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశప్రధానిగా మారిన విధానాన్ని చూపించనున్నారు. వీటన్నింటిలో దర్శకులకు సరైన స్వేచ్ఛ, వివాదాలను ప్రస్తావించే అవకాశం వంటివి ఉంటాయా? అంటే అనుమానమే. కేవలం వారి భజనకే ఇవి పరిమితం అవుతాయేగానీ వివాదాలను చర్చించే అవకాశాలు మాత్రం లేవు.
ఇక మోదీ బయోపిక్‌లో వర్మ ‘రక్తచరిత్ర’లో పరిటాల రవిగా, తాజాగా రామ్‌చరణ్ ‘వినయ విధేయ రామ’లో విలన్‌గా నటిస్తోన్న వివేక్ ఒబేరాయ్ మోదీ పాత్రను పోషించనున్నాడట. నటునిగా ఆయనకు వంక పెట్టడానికి లేకపోయినా మోదీ హయాంలో జరిగిన గోద్రా దుర్ఘటన, నేడు దేశంలో పెరిగిపోతున్న అసహనం, అంబానీలకు, నీరవ్‌మోదీ, మాల్యా వంటి వారి విషయంలో మెతకగా, జీఎస్టీ, నోట్లరద్దు వంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న మోదీ విధానాన్ని చూపిస్తారా? అంటే లేదనే సమాధానమే వస్తుంది.