తెలుగులో ఆ మధ్య మణిశర్మ, కోటి, కీరవాణి వంటి ఉద్దండుల తర్వాత తెరపైకి దూసుకువచ్చిన పేర్లు దేవిశ్రీప్రసాద్, తమన్. మణిశర్మకి పెద్దగా అవకాశాలు రాకపోవడం, కోటి కనుమరుగు కావడం, కీరవాణి కేవలం సెలక్టెడ్‌గా మాత్రమే చిత్రాలు చేస్తూ ఉండటంతో దేవిశ్రీ, తమన్‌లు తమ హవా చూపారు. వీరిలో తమన్‌కి కాపీ క్యాట్ అనే బిరుదు వచ్చింది. అయినా కూడా తమన్ అతి తక్కువ చిత్రాలతోనే స్టార్ హీరోల చిత్రాలకు పనిచేయడమే కాదు.. మణిశర్మ తర్వాత బ్యాగ్రౌండ్ స్కోర్‌లో టాప్ అనిపించుకున్నాడు.
ఇక పలువురు స్టార్స్‌కి ఆస్థాన సంగీత దర్శకునిగా మారి అతి తక్కువ వ్యవధిలోనే ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రంతో 100 చిత్రాలు పూర్తి చేశాడు. మరోవైపు టీజర్లకు, మోషన్ పోస్టర్స్‌కి కూడా ఈయన అందించిన సంగీతం బాగా క్లిక్ అయింది. ‘సైరా’ మోషన్ పోస్టర్‌కి ఏరికోరి రెహ్మాన్ వైదొలగిన తర్వాత తమన్‌తో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పించారు. ఇక ఈ ఏడాది ఆయన సంగీతం అందించిన ‘భాగమతి, తొలిప్రేమ, అరవింద సమేత వీరరాఘవ’ చిత్రాలతో తనలోని వైవిధ్యాన్ని రుచి చూపించాడు.
ముఖ్యంగా ‘అరవింద సమేత వీరరాఘవ’లో ఒకటి రెండు పాటలకు అద్భుతమైన సంగీతం అందించినా కూడా త్రివిక్రమ్ చిత్రీకరణ వల్ల ఆయా పాటలు సరిగా అలరించలేకపోయాయి. అంతే గానీ ఈ విషయంలో తమన్ తప్పేమీ లేదు. ఇలా తమన్ కొత్త కొత్తగా తన సత్తాచాటుతూ ఉంటే దేవిశ్రీప్రసాద్ మాత్రం చిత్ర చిత్రానికి తన మ్యాజిక్ విషయంలో డౌన్ అవుతున్నాడు. ‘రంగస్థలం, భరత్ అనే నేను’ తర్వాత ఆయన సంగీతం అందించిన చిత్రాల మ్యూజిక్ వింటే అది అందరికీ తెలుస్తుంది.
‘హలోగురు ప్రేమకోసమే’ నుంచి ‘వినయ విధేయ రామ, ఎఫ్2’ చిత్రాలకు ఆయన అందించిన ట్యూన్స్ కనీసం ఒక సారి కూడా వినలేని స్థితిలో ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు మ్యూజిక్ పరంగా అనుకున్నంతగా అయితే లేవు. ఏమైనా దర్శకహీరోలు మ్యాజిక్ చేస్తే తప్ప ఇవి అలరించే పరిస్థితి కనిపించడం లేదు. మరి దేవిశ్రీకి సంగీతం మీద శ్రద్ద తగ్గిందా? లేదా తానేమిచ్చినా ఓకే అంటారనే ఓవర్‌కాన్ఫిడెన్స్ పెరిగిందా? అనేది అర్ధం కావడం లేదు. ఇదే సందర్భంగా పరభాష నుంచి వచ్చిన అనిరుధ్, జిబ్రాన్ వంటి వారు అలరించలేకపోవడం మాత్రమే దేవిశ్రీని ఇప్పటికీ కాపాడుతోందని చెప్పాలి.