తెలుగులో హీరో అంటే రాముడు మంచి బాలుడు... ఇది పూరి రాకముందు మాట.. హీరో అంటే ఓ పోకిరి...ఓ ఇడియట్... దేశముదురు... ఇది పూరి వచ్చిన తరువాత మాట.. ఇలా తెలుగు సినిమా హీరోయిజాన్నిపూరి జగన్నాథ్ కొత్త పుంతలు తొక్కించాడు. ఇండస్ట్రీ హిట్లిచ్చినా తన కొడుక్కి మాత్రం సక్సెస్‌ని అందించలేకపోయాడు అనే అపవాదును కూడా సొంతం చేసుకున్న పూరికి ఇప్పుడు హిట్టు కావాలి. తన దారిలో ప్రయత్నిస్తే అది దొరకదు. హిట్టు చిక్కాలంటే తన పంథాను పక్కన పెట్టి కొత్త దారిలో ప్రయత్నించాల్సిందే.
ఇదే విషయాన్ని కాస్త ఆలస్యంగా అర్థం చేసుకున్న పూరి తన తదుపరి చిత్రానికి కొత్త జానర్‌ని ట్రైచేయబోతున్నాడట. అయితే అలాంటి కథను తెరకెక్కించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పూరీని నమ్మో హీరో కావాలి. తనే హిట్లిచ్చి కొంత మందిని స్టార్‌లని చేసిన పూరి గత కొన్ని నెలలుగా తనకు హిట్టిచ్చే హీరో కోసం అణ్వేషించి చివరికి రామ్‌ను పట్టేసుకున్నాడు. పూరితో కలిసి పనిచేయాన్నది రామ్ కోరిక. అదే కష్టకాలంలో వున్నపూరికి కలిసొచ్చింది. అయితే `నేను శైలజ` వంటి హిట్ తరువాత రామ్‌కూ హిట్ లేదు. ఈ ఇద్దరు కలిసి తాము ఎప్పుడూ ట్రై చేయని కొత్త జానర్ కథని చేయబోతున్నారు. అదే హారర్ జానర్.
యస్.. పూరి జగన్నాథ్, రామ్‌ల కలయికలో రాబోతున్న సినిమా హారర్ నేపథ్యంలో సరికొత్త ట్విస్టులతో సాగుతుందని, అందుకే ఈ చిత్రంలో నటించడానికి రామ్ ఓకే చెప్పాడని బయట జోరుగా ప్రచారం జరుగుతోంది. హీరో రామ్ కెరీర్‌లో 17వ చిత్రంగా సెట్స్‌పైకి రానున్న ఈ సినిమా వర్కవుట్ అయితే ఓకే కాకపోతే ఇద్దరి పరిస్థితి మాత్రం రెంటికి చెడ్డ రేవడిగా మారే అవకాశం లేకపోలేదు. పూరి కెరీర్‌తో పాటు రామ్ కెరీర్ కూడా గతుకుల రోడ్డెక్కిన లారీలా తయారవ్వడం ఖాయం అని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఈ బుధవారం 4గంటలకు ఈ సినిమాకు సంబంధించిన సర్‌ప్రైజ్ రాబోతోంది. దాన్ని బట్టే సినిమా ఎలా వుంటుంది? ఏంటి అనే విషయాలమీద ఓ క్లారిటీ వస్తుంది. అంత వరకు వేచి చూడాల్సిందే.