2018 మోస్ట్ లక్కీ హీరోయిన్స్ గా సమంత, రష్మిక మందన్న పోటీపడుతుండగా.. అన్ లక్కీ హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ గా మాత్రం సాయిపల్లవి తన బెర్త్ కన్ఫర్మ్ చేసుకొంది. 2017లో ఫిదా, ఎం.సి.ఏ లాంటి సూపర్ హిట్స్ తో బెస్ట్ హీరోయిన్ గా నిలిచిన సాయిపల్లవికి ఈ ఏడాది మాత్రం అన్నీ ఫ్లాప్సే. తెలుగు తమిళ భాషల్లో రూపొందిన కణం తమిళంలో కంటే తెలుగులో పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన పడి పడి లేచే మనసుతోపాటు.. అదే రోజున విడుదలైన మరో తమిళ చిత్రం మారి 2 కూడా బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది.
ఈ మూడు చిత్రాల్లో సాయిపల్లవి నటనకి మంచి పేరే వచ్చినప్పటికీ.. మూడు సినిమాలు కమర్షియల్ గా ఫెయిల్ అవ్వడంతో.. ఈ ఏడాది సాయిపల్లవికి ఒక్క హిట్ కూడా లేకపోయింది. ఒక నటిగా ఆమెకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు కానీ.. ఒక హీరోయిన్ గా ఆమె ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వాలంటే మాత్రం అర్జెంట్ గా అమ్మడికి ఒక సూపర్ హిట్ కావాల్సిందే. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్.జి.కెలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో అమ్మడికి చాలా చాలెంజింగ్ రోల్ అని వినికిడి.
ఈ సినిమా రిజల్ట్ పక్కన పెడితే.. సాయిపల్లవి ఇమ్మీడియట్ గా కనీసం ఒక్క సినిమా అయినా సైన్ చేయాలి. లేదంటే.. కొత్త హీరోయిన్ల ప్రవాహంలో ఆమె కొట్టుకుపోవడం ఖాయం. మరి ఈ విషయాన్ని సాయిపల్లవి గ్రహించి, వెంటనే ఏదైనా స్క్రిప్ట్ ను ఒకే చేస్తుందో లేకపోతే ఎప్పట్లానే అది నచ్చలేదు, ఇది నచ్చలేదు అంటూ టైమ్ పాస్ చేస్తుందో చూడాలి.