వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతున్న చిత్రాలు డేట్స్ కన్ఫర్మ్ చేసుకున్నాయి. మొత్తంగా ఓ అరడజను చిత్రాలు విడుదల కానుండగా, పెద్ద స్టార్, అందునా సీనియర్ స్టార్స్ నటిస్తోన్న మూడు చిత్రాలు, ఒక యంగ్‌స్టార్ చిత్రం విడుదల కానున్నాయి. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌గా రూపొందిస్తున్న రెండు భాగాలలో మొదటిదైన ‘కథానాయకుడు’ ముందుగా జనవరి 9న విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, ఆడియో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. నిజానికి బాలయ్యకి యూత్‌లో, లేడీస్, ఫ్యామిలీ ఆడియన్స్, క్లాస్ వర్గాల ప్రేక్షకుల్లో పెద్దగా పట్టులేదు. ఆయనదంతా మాస్ జపం. కానీ దానికి విరుద్దంగా ‘కథానాయకుడు’ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇక జనవరి 10న ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘పెట్టా’ చిత్రం విడుదల కానుంది. రజనీకాంత్‌తో పాటు నవాజుద్దీన్‌సిద్దిఖి, విజయ్ సేతుపతి, సిమ్రాన్, త్రిష వంటి భారీ తారాగాణం ఇందులో నటిస్తున్నారు. ఈ మూవీ కూడా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లోనే, తమిళ వాసన కొడుతూ ఉంది. కార్తీక్‌సుబ్బరాజుకి వైవిధ్యభరితమైన చిత్రాలు తీస్తాడనే పేరు ఉన్నా కూడా ‘పెట్టా’ ట్రైలర్ మాత్రం పాత వాసనలు కొడుతూనే ఉంది. ఇదో అతుకులబొంతలా, రజనీ స్టైల్, యాక్షన్, రొమాన్స్, యాక్షన్ సీన్స్ ఉన్నా కూడా ఇవేమీ ఆకట్టుకోలేకపోవడమే కాదు.. ఆత్మలేని శరీరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడో ఏదో మిస్ అయిందనే వెలితి ఈ ట్రైలర్‌ని చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది. ‘కబాలి, కాలా’ వాసన ఇక్కడ కూడా వస్తోంది.
ఇక రామ్‌చరణ్-బోయపాటి శ్రీనులు తమ మొదటి ట్రైలర్ ద్వారా ఏమి ఆశించారో అది టార్గెట్‌ని రీచ్ అయింది. ‘వినయ విధేయ రామ’ చిత్రం మొదటి ట్రైలర్‌ని మాస్, యాక్షన్ ప్రియులకు చేరేలా కట్ చేశారు. వారు ఆశించిన విధంగానే ఇది మాస్‌లోకి బాగా దూసుకెళుతోంది. ఫైనల్‌గా విక్టరీ వెంకటేష్-మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్‌లు ఎంటర్‌టైన్‌మెంట్‌గా చేసిన ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ఫస్ట్రేషన్) చిత్రం యూత్‌నే కాదు.. కుటుంబ ప్రేక్షకులతో పాటు యూత్‌ని, మహిళాభిమానులను కూడా అలరించేలా ఉన్నాయి. మరి ట్రైలర్స్ సంగతి పక్కనపెడితే ఈ నాలుగు చిత్రాలు విడుదలైన తర్వాత దేంట్లో కంటెంట్ ఉంటే దానికే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది వాస్తవం.