టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్‌లో కూడా మ్యూజిక్ మెజీషియన్ దేవిశ్రీప్రసాద్ హవా బాగా కొనసాగుతోంది. మధ్యలో తమన్ కొంతకాలం పోటీకి రావడం, గిబ్రాన్, అనిరుధ్ వంటి పరభాషా సంగీత దర్శకుల రాకతో ఆయన కెరీర్ కాస్త స్లో అవుతుందని కొందరు భావించారు. కానీ వాటిని అబద్దమని నిరూపిస్తూ ఈ సంచలన సంగీత దర్శకుడు ముందుకు దూసుకుని వెళ్తున్నాడు. ‘వినయ విధేయ రామ’ ఆడియో, ప్రీరిలీజ్ వేడుకలో మైఖేల్ జాక్సన్ లుక్‌లో కనిపించిన ఆయన ప్రస్తుతం ‘వినయ విధేయ రామ’తో పాటు ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో విడుదల కానున్న అనిల్‌రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ‘ఎఫ్ 2’ ( ఫన్ అండ్ ఫస్ట్రేషన్) చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు. ఇక దేవిశ్రీ మెగాహీరోలకు అంటే ప్రత్యేకంగా సంగీతం, ట్యూన్స్ అందిస్తాడు. ఇక పోటాపోటీగా విడుదల కానున్న ఈ రెండు చిత్రాలలో కూడా మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్-మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్‌లు నటిస్తుండటం మరో విశేషం. ఈ ఏడాది ఇప్పటికే ఆయన ‘రంగస్థలం, భరత్ అనే నేను’ వంటి బ్లాక్‌బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ఇటీవల కాలంలో బోయపాటి శ్రీను-దేవిశ్రీప్రసాద్‌లు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. దీంతో వీరిద్దరికి మనస్పర్ధలు వచ్చాయని అందువల్ల భవిష్యత్తులో మరలా ఇద్దరు కలవడం అసంభవం అని కొందరు భావించారు. అనుకున్నట్లే ఒకటి రెండు చిత్రాలకు బోయపాటి వేరే సంగీత దర్శకులను ఎంచుకున్నాడు. కానీ మరలా దేవిశ్రీతో కలసి ‘జయజానకి నాయకా’తో పాటు ‘వినయ విధేయ రామ’కి కూడా సంగీతం అందించాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి ఆస్థాన సంగీత దర్శకునిగా పేరు తెచ్చుకున్న ఈయన గతంలో ఒకటి రెండు చిత్రాలు మాత్రమే బయటి సంగీత దర్శకులతో చేసిన త్రివిక్రమ్ మూవీస్‌కి వరుసగా సంగీతం అందిస్తూ వచ్చాడు. కానీ ‘అ..ఆ’తో పాటు ‘అజ్ఞాతవాసి’కి కూడా దేవిశ్రీని కాకుండా అనిరుధ్, మిక్కీజెమేయర్ వంటి వారికి త్రివిక్రమ్ చాన్స్ ఇచ్చాడు. ఇటీవల వచ్చిన ఎన్టీఆర్ ‘వినయ విధేయ రామ’తో తమన్‌ని ఎంచుకుని పనిచేశాడు.
కానీ తాజాగా ‘వినయ విధేయ రామ’ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఈ ఇద్దరు కలిసి కనిపించడమే కాదు... ఒకరినొకరు అప్యాయంగా కౌగిలించుకున్నారు. సో.. త్రివిక్రమ్ తదుపరి చిత్రాలకు దేవిశ్రీ రీఎంట్రీ ఇవ్వడం గ్యారంటీ అని తెలుస్తోంది. మొత్తానికి కాస్త విభేదాలు వచ్చినా మరలా దేవి వారితో కలిసి పోయి పనిచేస్తూ ఉండటం ఆనందకరమైన విషయం. రాజకీయాలలోనే కాదు.. సినిమాలలో కూడా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని పెద్దలు ఊరికే అనలేదు....!