తెలుగులో అసలు ఇతను హీరోనేనా? అనే అనుమానం తెప్పించే నటుల్లో మెగా కాంపౌండ్‌కి చెందిన హీరో, అల్లుఅరవింద్ గారి చిన్నబ్బాయి అల్లుశిరీష్ మంచి మార్కులే పడతాయి. సత్తా లేనిదే వారసత్వ హీరోలు కూడా రాణించలేరనే నిజం దీనితో నిరూపితం అవుతున్నా కూడా ఇంకా ఇంకా ప్రేక్షకులపై రుద్ది, వారి లుక్,ఇతర నటనా పటిమను కూడా జనాలకు చేరువయ్యేలా చేయడం కోసం పడే అగచాట్లు కూడా దీనికి మరో ఉదాహరణగా నిలుస్తాయి. మరో కొత్త హీరోకి అంత పెద్ద పెద్ద బేనర్లలో, దర్శకులతో డిజాస్టర్లు వస్తే వారికి వారసత్వం లేకపోతే ఇంకా సినిమా చాన్స్‌లు వస్తాయా? అనే దానికి తీసేవాడుండగా మనకేం డోకా అని శిరీష్ నిరూపిస్తూ ఉన్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా రెండు చిత్రాలు చేసి, ఏకంగా ప్రకాష్‌రాజ్ నిర్మాతగా రాధామోహన్ దర్శకత్వంలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘గౌరవం’ ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు.
ఇక మినిమం గ్యారంటీ దర్శకుడైన మారుతి దర్శకత్వంలో ఆయన రెజీనాతో కలిసి ‘కొత్తజంట’ చేశాడు. ఇందులో శిరీష్ కంటే రెజీనానే బాగా నటించిందనే పేరు వచ్చింది. పరుశురాం పుణ్యమా అని ‘శ్రీరస్తు..శుభమస్తు’తో ఓకే అనిపించి, ఇక దున్నేస్తానని చెప్పాడు. తండ్రి, అన్నయ్యల పలుకుబడి పుణ్యమా అని మోహన్‌లాల్ నటించిన భారీ మలయాళ చిత్రం ‘1971 బియాండ్‌ది బోర్డర్స్’లో ఓ పాత్రలో నటించాడు. ఆ తర్వాత విభిన్న చిత్రాలను ‘టైగర్, ఎక్కడికిపోతావు చిన్నవాడా’ వంటివి తీసిన డిఫరెంట్ చిత్రాల దర్శకుడు వి.ఐ.ఆనంద్ చేతిలో పెట్టి ‘ఒక్కక్షణం’ తీస్తే అది అరకొరకే సరిపోయింది.
ప్రస్తుతం ఆయన మలయాళంలో దుల్కర్‌సల్మాన్ నటించి, మంచి పేరు తెచ్చుకున్న ‘ఎబిసిడీ’ అనే మలయాళ రీమేక్ చేస్తున్నాడు. ‘అమెరికన్ బేస్‌డ్ కన్ఫ్యూజ్‌డ్ దేశీ’ అనేది ఈ ఎబిసిడికి పూర్తి అర్ధం. ఇక ఈ చిత్రం కోసం తన మెగా కాంపౌండ్‌నే కాదు... ఏకంగా ఇటీవల చిన్నచిత్రాలను ఆచితూచి ఎంచుకుని ‘నేనే రాజు నేనే మంత్రి, పెళ్లిచూపులు, మెంటల్ మదిలో, కేరాఫ్ కంచరపాళెం’ వంటివి విడుదల చేస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్‌బాబుకి కూడా ఈ చిత్రంలో పేరు కల్పించాడు. మధుర శ్రీధర్‌రెడ్డితో పాటు ‘పెళ్లిచూపులు’ నిర్మాతల్లో ఒకరైన యాష్‌రంగినేనిలు దీనిని నిర్మిస్తున్నారు. మరి ఇది సురేష్‌బాబు అభిరుచి, సినిమా చూసి తీసుకున్న నిర్ణయమా? లేక మొహమాటం బాపత్తా? అనేది సినిమా విడుదలైతే గానీ తెలియదు. ఏమాత్రం తేడా వచ్చినా ఆరో చిత్రంతో మరలా బొక్కబోర్లాపడటం ఖాయమే గానీ, సురేష్‌బాబు కూడా జాయిన్‌కావడం, ఆల్‌రెడీ మలయాళంలో ప్రూవ్ చేసుకున్న సబ్జెక్ట్ కాబట్టి శిరీష్ కాస్త గట్టిగా నమ్మకం పెంచుకున్నాడు.