‘రంగస్థలం’.. ఆ ఏడాది విడుదలైన చిత్రాలలో ఓ ఆణిముత్యం. ఇందులోని రామ్‌చరణ్ నటన చూసి అందరూ ఇంతకాలం ఈ నటన ఎక్కడ దాచోడో అంటూ ఆశ్చర్యపోయారు. అందుకే కొందరు 2018లో రామ్‌చరణే ఉత్తమ నటుడని ఘంటాపధంగా చెబుతున్నారు. ఇక ఈ చిత్రం వెంటనే మాస్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించి, స్టార్స్ ఇమేజ్‌ని, వారి క్రేజ్‌ని పీక్స్‌లో చూపించే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’ మొదలుపెట్టాడు. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు కలిసి నటించే రాజమౌళి రియల్ మల్టీస్టారర్‌కి కూడా నిర్మాత అయిన దానయ్యే దీనిని కూడా నిర్మిస్తుండటం విశేషం. ‘భరత్ అనే నేను’ భామ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న దీనికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం ఉన్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ అత్యంత పవర్‌ఫుల్ విలన్ పాత్రను పోషిస్తున్నాడు. కథలో పెద్దగా కంటెంట్ లేకపోయినా ‘సరైనోడు’తో బన్నీకి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన బోయపాటి ఈ మూవీని ఎంతో పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దాడని తెలుస్తోంది. బోయపాటి చిత్రాలలో హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం కోసం విలన్లను కూడా అద్భుతంగా తీర్చిదిద్దడం బోయపాటి స్టైల్.
ఇక ఈ మూవీ షూటింగ్‌కి రేపటితో గుమ్మడికాయ కొట్టనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో డ్యాన్సర్లతో రామ్‌చరణ్‌పై ఓ స్పెషల్‌సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ నెల 27వ తేదీన ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుక ఎలా జరుగుతుంది? అని మెగాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూడటమే కాదు.. ఈ వేడుకకు భారీ స్థాయిలో తరలి రావాలని వేచిచూస్తున్నారు. ఇక ఈ వేడుకకు చీఫ్‌గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి హాజరు కానుండటంతో మెగాభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోతోంది. ఇక ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయనున్నారు. ఆ పక్కరోజున అంటే జనవరి 12న మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్ సీనియర్ స్టార్ వెంకటేష్‌తో కలిసి నటిస్తుండగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ‘ఎఫ్ 2’ చిత్రం విడుదల కానుండటం విశేషం.
ఇక ఇప్పటికే వ్యాపారవేత్తగా, స్టార్‌గా, నిర్మాతగా కూడా దూసుకుపోతున్న రామ్‌చరణ్ తన భవిష్యత్తు ప్రాజెక్ట్స్ విషయంలో కూడా తన చాణక్యం చూపిస్తున్నాడు. అందుకు గాను అయన ‘వినయ విధేయ రామ’ చిత్రంతో పాటు రాజమౌళి-దానయ్యల చిత్రం రెమ్యూనరేషన్‌ని కూడా రాజమౌళి మల్టీస్టారర్‌లో పెట్టుబడిగా పెట్టి లాభాలలో వాటా తీసుకోనున్నాడు. ఈ చిత్రానికి భారీ లాభాలు రావడం ఖాయమని, ‘మగధీర’తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన రాజమౌళి మీద ఉన్న నమ్మకంతోనే చరణ్ పక్కా ప్లాన్‌తో ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.