కేసులంటే మామూలు వారికి భయం గానీ.. వర్మకి ఎలాంటిభయం ఉండదని, ఆయన వాటిని ఎప్పుడో దాటిపోయాడనే చెప్పాలి. ఇక ఒకవైపు ఎన్టీఆర్ బయోపిక్‌గా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ‘కథానాయకుడు, మహానాయకుడు’ అనే చిత్రాలను తీస్తూ ఉన్నాడు. దీనికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. కానీ ఇది ఎన్టీఆర్ పూర్తి జీవితగాధ అంటే ఎవ్వరూ నమ్మడం లేదు. కీలకపరిణామాలకు కారణమైన లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత జరిగిన వెన్నుపోటు రాజకీయాల గురించి ఇందులో ప్రస్తావించిన దాఖలాలు కనిపించడం లేదు. మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ వేడుక విడుదల రోజే రాంగోపాల్‌వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీలోని ‘వెన్నుపోటు’ పాటను విడుదల చేశారు. ఈ పాట విడుదలతో ఏపీలోని రాజకీయ వాతావరణం వేడెక్కింది.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్లలలో చంద్రబాబుని ఘోరంగా చూపించారంటూ కేసులు పెడుతున్నారు. కర్నూల్ జిల్లాలో కూడా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డి.. వర్మ ఈ పాటలో చంద్రబాబుని కించపరుస్తూ చూపించాడని కేసు నమోదు చేశాడు. దీంతో వర్మ దీనికి ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ఎస్వీమోహన్‌రెడ్డిపై నేను కూడా కేసు పెడతాను. ఇందుకోసం కర్నూల్ వస్తానని ట్వీట్ చేస్తూ, ఎస్వీమోహన్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు కాపీని ట్వీట్ చేశాడు. నిజానికి వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ని నిజాయితీగా, కష్టపడి తీస్తే ఇది సంచలనాలకు కేంద్రబిందువు కావడం ఖాయమనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకాలం వర్మ ఇలాంటి పలు సంచలన చిత్రాలు తీసినా కేవలం పబ్లిసిటీకి తప్ప మనసు పెట్టి చిత్రాలను తీసి ప్రేక్షకులను మెప్పించడంలో ఆయన విఫలమయ్యాడు.
కానీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని ఆయన నిజాయితీగా తీసి ఉంటే మాత్రం సంచలన విజయం ఖాయమనే చెప్పాలి. ఎందుకంటే తాజాగా ఇందులో ఏది నిజమైన బయోపిక్? దేని కోసం ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు? అని పోల్ పెడితే దాదాపు 40, 50 వేల మంది పోలింగ్ లో పాల్గొనడమే కాదు.. వర్మ చిత్రమే చూడాలనుకుంటున్నామని మూడింట రెండింతల మంది తెలపడం ఈ చిత్రంపై ఉన్న అంచనాలకు అద్దం పడుతుంది.