సుప్రసిద్ద నిర్మాత, వివాదాలకు కేంద్రబిందువు అయిన బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తన చిత్రాల బడ్జెట్, క్యాస్టింగ్, హీరోయిన్లు, దర్శకుల విషయంలో సంచలనాలకు మారు పేరుగా మారాడు. తన మొదటి చిత్రమే విక్టరీ వినాయక్ దర్శకత్వంలో ‘అల్లుడుశీను’ చిత్రం చేశాడు. ఆ తర్వాత భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో ‘స్పీడున్నోడు’, బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ‘జయజానకి నాయకా’, శ్రీవాస్‌తో ‘సాక్ష్యం’, ఇటీవల ‘కవచం’ వంటి చిత్రాలు చేశాడు. అయితే నిర్మాతల వారసులకు పెద్దగా వారసత్వపు లాభం ఉండనేది జగమెరిగిన సత్యం. ఈ విషయంలో రామానాయుడు-విక్టరీ వెంకటేష్ వంటి వారు మాత్రమే మినహాయింపు. అయినా తన కుమారుడిని హీరోగా నిలబెట్టేందుకు బెల్లంకొండ సురేష్ విచ్చలవిడిగా, గతంలో ఎవ్వరూ పెట్టని విధంగా కోట్లు ఖర్చుపెడుతున్నాడు. స్టార్ డైరెక్టర్, సెన్సేషనల్ హీరోయిన్స్‌తో ఖర్చుకు వెనుకాడకుండా భారీ బడ్జెట్ కేటాయిస్తున్నాడు.
ఇక సాయిశ్రీనివాస్ నటించిన కొన్ని చిత్రాలు ఫర్వాలేదనిపించినా కూడా ఓవర్ బడ్జెట్ వల్ల కమర్షియల్‌గా బాగా దెబ్బతిన్నాయి. అలాంటి ఈ హీరోకి ఇప్పుడు తన టాలెంట్ చూపే అవకాశం లభించింది. 1980ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ త్వరలో పట్టాలెక్కనుంది. టైగర్ నాగేశ్వరరావు నాడు ధనికులు, పోలీసుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. ఉన్నవారిని దోచి, లేని వారికి పెట్టే ఆంధ్రా రాబిన్ హుడ్‌గా ఆయనను కొందరు అభిమానిస్తారు. ఈయన బయోపిక్‌ని వంశీకృష్ణ తీయనున్నాడు. మొదట నానిని, ఆ తర్వాత దగ్గుబాటి రానాల వద్దకు ఈ అవకాశం వెళ్లింది. రాబిన్‌హుడ్ తరహాలో ఆజానుబాహుడైన రానా అయితే దీనికి సరిగా సరిపోతాడని అందరూ భావించారు.
కానీ ఏవో కారణాల వల్ల రానా కూడా దీనికి నో చెప్పాడట. దాంతో రానా, ప్రభాస్ వంటి వారి తరహాలో ఆజానుబాహుడైన సాయిశ్రీనివాస్ వద్దకు ఈ చిత్రం వెళ్లింది. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు వైవిధ్యభరిత చిత్రాలను, బయోపిక్‌లను బాగా తీస్తే హీరోలతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారు. మరి అలాంటి అరుదైన కథ ఇప్పుడు సాయి శ్రీనివాస్ కోర్టులో ఉంది. ఇక ఈ మూవీకి కూడా బెల్లంకొండ అనుకుంటే భారీ బడ్జెట్‌నే కేటాయించగలడు. మరి ఈ అరుదైన అవకాశం అయినా సాయిని హీరోగా నిలబెడుతుందో లేదో వేచిచూడాల్సివుంది...!