తెలుగులో బి.గోపాల్, వి.వి.వినాయక్‌లకు సరిసమానంగా పవర్‌ఫుల్ చిత్రాలు, హీరోయిజాన్ని పీక్స్‌లో చూపించే కమర్షియల్ డైరెక్టర్‌గా బోయపాటి శ్రీనుకి మంచి గుర్తింపు ఉంది. కానీ ఈయన యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో చేసిన ‘దమ్ము’, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో చేసిన ‘జయజానకి నాయకా’ చిత్రాలు మాత్రం పెద్దగా మెప్పించలేకపోయాయి. కానీ ఈయన అతి తక్కువకాలంలోనే నందమూరి నటసింహం బాలకృష్ణతో ‘సింహా, లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన దానయ్య నిర్మాతగా రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఈయన బాలయ్యకే కాదు... రవితేజ, వెంకటేష్, అల్లుఅర్జున్ వంటి ఎందరికో పవర్‌ఫుల్‌హిట్స్‌ని ఇచ్చాడు.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ.. క్రిష్ దర్శకత్వంలో తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌ని ‘కథానాయకుడు, మహానాయకుడు’ చిత్రాలు చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. మరోవైపు బోయపాటి-రామ్‌చరణ్‌ల ‘వినయ విధేయ రామ’ షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. అయితే బోయపాటి శ్రీనుతో గతంలో మెగాస్టార్ చిరంజీవి-అల్లుఅరవింద్‌ల కాంబినేషన్‌లో ఓ చిత్రం ఉంటుందని స్వయంగా అల్లుఅరవిందే ప్రకటించాడు. అల్లుఅర్జున్‌తో బోయపాటి చేసిన ‘సరైనోడు’ చిత్రం సరైన కంటెంట్ లేకపోయినా అద్భుతవిజయం సాధించిందంటే దీనికి బోయపాటి మూల కారకుడు. దాంతో ఈ మూవీ వెంటనే అల్లుఅరవింద్.. చిరుతో చేయాల్సిన చిత్రానికి సంబంధించి కూడా బోయపాటికి అడ్వాన్స్ ఇచ్చాడు. కానీ ప్రస్తుతం చిరంజీవి ‘సైరా’ చిత్రంతో పాటు ఆ తదుపరి కొరటాలశివతో మూవీ చేయనున్నాడు. దాంతో బోయపాటి-చిరుల కాంబినేషన్ ఇప్పుడే వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
మరోవైపు బాలయ్య తన తదుపరి చిత్రాన్ని గతంలో ‘చెన్నకేశవరెడ్డి’ తీసిన వినాయక్‌తో చేస్తాడనే ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. బాలయ్య.. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బోయపాటితోనే చిత్రం చేయనున్నాడు. ఈ మూవీ గురించి బోయపాటి చెబుతూ, ‘సింహా, లెజెండ్’ చిత్రాల తర్వాత బాలయ్యబాబుతో హ్యాట్రిక్ చిత్రం చేయనున్నాను. ఈ రెండు చిత్రాలు ఏ స్థాయి విజయాలను అందుకున్నాయో దానికి మించిన స్థాయిలో మూడో చిత్రం ఉంటుంది అని తెలిపాడు. అంతేకాదు.. ఈ మూవీ ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని తెలిపాడు. సో.. ఇక నందమూరి అభిమానులకు ఈ వార్త ఎంతో సంతోషాన్ని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బాలయ్య అభిమానులకు బోయపాటి అంటే ఎంతో ఇష్టం. బాలయ్య వందో చిత్రాన్ని కూడా ఆయన ఫ్యాన్స్ బోయపాటితోనే చేయమని పట్టుబట్టిన సంగతి తెలిసిందే.