ఈ వారం రిలీజైన డైరెక్ట్ తెలుగు సినిమాలు ఏమో గానీ విపరీతమైన అంచనాల నడుమ కన్నడ నుండి తెలుగుకు డబ్బింగ్ అయిన KGF మాత్రం తెలుగు రాష్ట్రాల్లోని B, C సెంటర్లలో పండగ చేసుకోవడం ఖాయం అంటున్నారు ఓ వర్గం సమీక్షకులు, ప్రేక్షకులు. మహా మహా స్టార్ హీరోలు సైతం అసూయ పడే బిల్డప్ షాట్లు, ఒళ్ళు గగ్గురు పొడిపించే యాక్షన్ లీడ్ సీన్లతో KGF మొత్తం పోరాటాల జాతర లాగా మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది అనడంలో సందేహం లేదు.
కన్నడ నాట తిరుగులేని రాకింగ్ స్టార్ యష్ నటనకు, ఉగ్రమ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ టేకింగ్ కెపాసిటీకి శాండల్ వుడ్ సాంతం దాసోహం అంటోంది. ఉగ్రమ్ చిత్రంతోనే ఊగిపోయిన దక్షిణాది జనాలు, ఇప్పుడీ KGFతో ప్రశాంత్ నీల్ పేరుని దిగ్గజ మాస్ దర్శకులైన రాజమౌళి, శంకర్ సరసన చేర్చటానికి కూడా ఎటువంటి భేషజాలకి పోరేమో. సాధారణంగా ఒక నాయకుడి పోరాట పటిమో, పాత్ర స్వభావం తెలపాలంటే రాజమౌళి లాంటోళ్ళు భూమి బద్దలయిపోయే యాక్షన్ సీన్ వేస్కోని కథలోకి జారుకుంటారు. అదే ప్రశాంత్ మాత్రం హీరో కనిపించే ప్రతి దృశ్యాన్ని ఓపెనింగ్ షాట్ లాగానే తీర్చిదిద్దేసారు.
ముఖ్యంగా బిల్డప్ షాట్లకైతే భవిష్యత్ దర్శకులకు ఇదో పాఠ్య పుస్తకం అవుతుంది అనడం అతిశయోక్తి కానే కాదు.
తెలుగు వారికి KGFలోని ఒక్క ముఖం కూడా పరిచయం లేకపోయినా, యష్ కనపడితే చాలు... థియేటర్స్ విజిల్ మోతలతో, చప్పట్ల శబ్దాలతో కప్పు లేచిపోయే విధంగా హర్ష ధ్వానాలు చేస్తున్నాయి అంటే సినిమా ఏ స్థాయిలో జనాలకి ఎక్కేసిందో అర్థమవ్వాలి. అందుకే భాషాభేధం లేకుండా నచ్చే సినిమా వదిలేస్తే చాలు, ఆదరించడంలో మన తెలుగు వారి తరువాతే ఎవరయినా. సో... సంక్రాంతి సందడి మొదలయ్యే దాకా KGF ఇరగేసి ఇస్తరాక్ వేయడం తథ్యం.