ఇంతకాలం చర్చలకే పరిమితమైన నందమూరి తారకరామారావు ‘భారతరత్న’ అవార్డు ఎన్టీఆర్ బయోపిక్ సందర్భంగా మరోసారి బలంగా బయటకు వచ్చింది. ఇటీవల లక్ష్మీపార్వతి ఎన్టీఆర్‌కి భారతరత్న రాకుండా సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నాడని, ఆయన దానిపై శ్రద్ద చూపడం లేదని విమర్శలు చేసింది. ఇక తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ వేడుకలో పరుచూరి గోపాలకృష్ణ మరోసారి ఎన్టీఆర్ భారతరత్న విషయాన్ని లేవనెత్తాడు.
ఆయన మాట్లాడుతూ, ఎన్నో వందల వేషాలలో కనిపించిన మహానుభావుడు ఎన్టీఆర్. ఆయన చేయని పాత్ర లేదు. తన జీవితంలో ఆయన వేయని వేషం లేదు. ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో క్రిష్ బాలయ్యను దాదాపు 63 గెటప్పులలో చూపించారు. దేశ ప్రజలకు బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు దేవుళ్లు. అయితే తెలుగు ప్రేక్షకులకు దేవుడు ఎన్టీఆర్. ‘కథానాయకుడు’ చిత్రంలోని బాలయ్య వేసిన 63 గెటప్పులను చూసి కేంద్రప్రభుత్వం కంగారుపడాలి. ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వనందుకు వారు భయపడాలి. ఒక జాతి మొత్తం ఎన్టీఆర్‌ని దేవుడిగా చూస్తోందని వ్యాఖ్యానించాడు. అయితే ఎన్టీఆర్‌కి భారతరత్న రాకపోవడానికి కారణం ఏమిటనే విషయంలో ఓ వాదన ఉంది. సీఎం చంద్రబాబునాయుడు దేవెగౌడ, గుజ్రాల్ వంటి ప్రభుత్వాలలోనే కాక ఎన్డీయే తరపున వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు... ఇటీవల వరకు మోదీతో కూడా ఎంతో సన్నిహితంగా ఉన్నాడు. కానీ ఆయన తన మామయ్య ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వకపోవడంపై ఎవరి మీదా ఒత్తిడి తెచ్చిన పరిస్థితి లేదు. దానికి కారణం ఒకటేనంటూ ఓ ప్రచారం ఉంది.
లక్ష్మీపార్వతి బతికి ఉన్నంతకాలం చంద్రబాబు ఎన్టీఆర్ భారతరత్న ఇచ్చే విషయంలో ఎలాంటి ప్రయత్నాలు చేయడని, ఎందుకంటే ఎన్టీఆర్‌కి భారతరత్న ఇస్తే చట్టపరంగా ఎన్టీఆర్‌కి రెండో భార్య అయిన లక్ష్వీపార్వతి చేతులకే ఎన్టీఆర్ భారతరత్న వస్తుంది. ఇది చంద్రబాబుకే కాదు.. నందమూరి ఫ్యామిలీలోని పలువురికి ఇష్టం లేదు. కాబట్టి లక్ష్మీపార్వతి బతికున్నంతకాలం ఎన్టీఆర్ భారతరత్న విషయంలో చంద్రబాబు ఎలాంటి గట్టి ప్రయత్నం చేయడనే వాదన బలంగా ఉంది. మరి దీనిలో నిజమెంతో వేచిచూడాల్సివుంది...!