తమిళ రాజకీయాల్లో ఎలాంటి ఆధిపత్య పోరు వుంటుందో దేశం మొత్తం చూసింది. ఒక వర్గం అధికారంలోకి వస్తే మరో వర్గాన్ని నడిరోడ్డుపై బట్టలూడదీసి చితకబాదే పద్దతి అక్కడ గత కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. ఇదే నిర్మాత మండలికి పాకింది. ప్రతి విషయంలోనూ చురుకుగా వ్యవహరిస్తున్న విశాల్‌పై గత కొంత కాలంగా నిర్మాతల మండలిలోని ఓ వర్గం గుర్రుగా వుంది. అదను చూసి విశాల్‌ని ఇరుకున పెట్టాలనుకున్న వాళ్లు ఇటీవల మండలి కార్యాలయానికి తాళం వేయడం, దాన్ని పగుల గొట్టి విశాల్ లోనికి వెళ్లాలని ప్రయత్నించడంతో ఈ తంతు పెద్ద రభసగా మారి అతన్ని పోలీసులు అరెస్టు చేయడం వరకు వెళ్లిన విషయం తెలిసిందే.
టీఎస్ ఎఫ్‌పీసీ కార్య కలాపాలు సవ్యంగా జరిగేలా చూడాలని, ఇందుకు పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయాలని తమిళ నిర్మాత అన్బు దొరై హైకోర్టులో పిటీషన్ వేశాడు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఇటీవల జరిగిన రభసపై తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంలో అంతా అతిగా స్పందించడం వల్లే రచ్చ అయిందని, అసలు విశాల్‌ను అదుపులోకి తీసుకోవాల్సిన అవరమే లేదని హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఏదైనా సమస్య వుంటే దాన్ని సామసర్యంగా పరిస్కరించుకోవాలని సూచిస్తూ నిర్మాతల మండలికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల పుస్తకాలన్నీ డిప్యూటీ రిజిస్ట్రార్ కో-ఆపరేటీవ్ సమక్షంలోని ఓ గదిలో భద్రపరిచి తాళం వేయాలని ఆదేశంచింది.
కోర్టు నిర్మాతల మండలిలోని ఓ వర్గం సభ్యులకు పరోక్షంగా అక్షింతలు వేసినా వారి తీరు మారకపోవడం గమనార్హం. నిర్మాతల మండలిలో అవకతవకలు జరిగాయి కాబట్టి అధ్యక్షుడు విశాల్ తన పదవికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయాల్సిందే అంటూ ఓ వర్గం సభ్యులు ఇప్పటికీ అదే స్థాయిలో డిమాండ్ చేస్తుండటం కొత్త వివాదానికి తెర తీసేలా వుంది. దానికి తోడు విశాల్ కూడా వారి వాదనకు విరుద్ధంగా అడుగులు వేస్తుండటం తమిళ సినీ పరిశ్రమలో సంచలనంగా మారుతోంది. దీంతో తమిళ పరిశ్రమలో మరి కొన్ని రోజులు ఈ ఆధిపత్య రాజకీయాలు ఇలాగే కొనసాగి పెద్ద దుమారంగా మారడం ఖాయంగా కనిపిస్తోందని సినీ విమర్శకలు చెబుతున్నారు.