ఈ శుక్రవారం రెండు తెలుగు సినిమాలతో పాటుగా.. రెండు పరభాషా చిత్రాలు కూడా విడుదలవుతున్నాయి. తెలుగు సినిమాలకు పోటీగా విడుదల చేస్తున్న తమిళ మూవీ ‘మారి 2’, కన్నడ మూవీ ‘కెజియఫ్’ సినిమాలు కూడా ఆయా భాషల్లో భారీగా తెరకెక్కిన సినిమాలే. తెలుగులో ‘పడి పడి లేచె మనసు, అంతరిక్షం’ సినిమాలు భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నాయి. ఇక తమిళ ‘మారి 2’పై కూడా తమిళంలో మంచి అంచనాలే ఉన్నాయి. అయితే తెలుగు సినిమాలు రెండు భారీ ప్రమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుని.. ప్రేక్షకులను థియేటర్స్ బాట పట్టిస్తున్నాయి. ఇక తమిళ ‘మారి 2’కి తెలుగులో అంతంత మాత్రం ప్రమోషన్స్ చేసారు ఆ సినిమా హాక్కులను కొన్న నిర్మాతలు. అయితే ఆ సినిమాలో హీరోయిన్ సాయిపల్లవి క్రేజ్‌తో సినిమా ఆడుతుందని నిర్మాతల నమ్మకం.
ఇక మొదటి నుండి భారీ అంచనాలున్న ‘కెజియఫ్’ సినిమా కూడా ఈ శుక్రవారమే విడుదల కాబోతుంది. యష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ, కన్నడలో విడుదలవుతున్న ఈ సినిమాపై.. సినిమాతో సంబంధంలేని ప్రముఖులు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. తమిళనాట ‘కెజియఫ్’ని విశాల్ వెన్నుదన్నుగా నిలిస్తే.. తెలుగులో సాయి కొర్రపాటి ఈ సినిమాని విడుదల చేస్తున్నాడు. ఇక మొదట్లో కెజిఎఫ్ ప్రమోషన్స్‌కి రాజమౌళిని పిలిచారు. రాజమౌళి కూడా ఈ సినిమా గురించి గొప్పగా చెప్పాడు. అయితే ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల అవుతున్నా.. ఎక్కడా సినిమా ప్రమోషనే లేదు.
తెలుగు సినిమాలతో పోలిస్తే ‘కెజియఫ్’ ప్రమోషన్స్ చాలా వీక్‌గా వున్నాయి. కన్నడలో భారీగా తెరకెక్కిన ఈ సినిమాకి మౌత్ టాక్ సరిపోతుందిలే అనుకున్నట్టుగా ఉంది నిర్మాతల తీరు. అందుకే ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్‌లను గ్రాండ్‌గా జరిపేసి... మిగిలిన ప్రమోషనల్ ఈవెంట్స్‌ని గాలికి వదిలేశారు. పడి పడి లేచె మనసు, అంతరిక్షం పోటాపోటీగా ప్రమోషన్స్‌లో జోరు చూపిస్తే ‘కెజియఫ్’ని కొన్న సాయి కొర్రపాటి మాత్రం చాలా లైట్ తీసుకున్నాడు. కనీసం హీరో ఇంటర్వ్యూ కానీ, హీరోయిన్ ఇంటర్వ్యూ కానీ లేదు. అలాగే పేపర్ పబ్లిసిటీ కానీ వెబ్ పబ్లిసిటీ కానీ లేదు. మరి ఈ ‘కెజియఫ్’ని మరో ‘బాహుబలి’గా భావించారో.. లేక ఆ చిత్ర దర్శకుడు రాజమౌళిలా ఫీలవుతున్నాడో తెలియదు కానీ.. చిత్ర ప్రమోషన్ విషయం పక్కన పెట్టేసి ధీమాగా సినిమాని విడుదల చేసేశారు. తెలుగు సినిమాల జోరులో ఈ ‘కెజియఫ్’ పరిస్థితి ఏమిటనేది ఇంకాసేపట్లో తెలిసిపోనుంది.