బాలీవుడ్ క్వీన్‌గా, లేడీ సూపర్‌స్టార్‌గా కంగనారౌనత్‌కి మంచి పేరుంది. పూరీజగన్నాథ్-ప్రభాస్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘ఏక్ నిరంజన్’ చిత్రం ద్వారా ఈమె టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. అయితే నటనాపరంగా ఆమెకి ఏమీ వంక చెప్పలేం గానీ వ్యక్తిగత జీవితం, ఎఫైర్లు, వివాదాస్పద వ్యాఖ్యలతో ఆమె నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సీనియర్లకు గౌరవం ఇవ్వదని, హీరోలను పట్టించుకోదని, దర్శకత్వంతో సహా అన్ని విషయాలలో తలదూరుస్తుందనే విమర్శలు ఆమెపై ఉన్నాయి. అంతేకాదు.. తన చిత్రం ఏది విడుదలకు సిద్దమైనా, ఆమె ఉచితమైన పబ్లిసిటీ కోసం తన మాజీ ప్రియుడు హృతిక్‌రోషన్‌పై విమర్శలు చేస్తూ దానిని ప్రచారానికి వాడుకుంటుంది.
ఇక కంగనారౌనత్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘మణికర్ణిక’ అనే చిత్రం చేస్తోంది. వీరనారి ఝాన్సీలక్ష్మీభాయ్ నిజజీవిత గాధ ఆధారంగా ఈమూవీ తెరకెక్కింది. మొదట ఈ చిత్రానికి తెలుగు దర్శకుడైన క్రిష్ దర్శకుడు. కానీ సడన్‌గా ఆయనను దర్శకత్వ బాధ్యతల నుంచి తొలగించి, తానే స్వయంగా దర్శకత్వం చేసింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ బాగానే అనిపించింది. కానీ టీజర్‌లో మాత్రం క్రిష్ తెరకెక్కించిన సీన్స్‌నే కట్ చేసి పెట్టారనే వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. కానీ ఈ ట్రైలర్ మాత్రం ఏమాత్రం ఎమోషన్స్‌ని అందుకోలేకపోతోంది. వీరనారి అంటే బిడ్డను వీపుకి కట్టుకుని, గుర్రపు స్వారీ, కత్తియుద్దం చేయడమే తప్ప సరైన ఎమోషన్స్ పండలేదని బాగా విమర్శలు వస్తున్నాయి. రిపబ్లిక్‌డే కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ మాత్రం పూర్తిగా నిరాశపరిచిందనే చెప్పాలి.
మొదట క్రిష్‌ని దర్శకునిగా పెట్టుకున్నప్పుడు వచ్చిన హైప్, స్వయంగా కంగనా దర్శకత్వ బాధ్యతలను తీసుకున్న తర్వాత బాగా తగ్గిపోయాయి. ఇక తెలుగు వాడైన దర్శకుడు క్రిష్‌ని తొలగించినా దర్శకత్వం అనే చోట ఆమె తన పేరుతో పాటు క్రిష్ పేరును కూడా వేయడం కాస్త ఫర్వాలేదనిపించే నిర్ణయం. ఇక తెలుగులో రాజమౌళి చిత్రాలకే గాక ‘బాహుబలి’, ‘భజరంగీ భాయిజాన్’ వంటి చిత్రాలకు కథని అందించిన రాజమౌళి తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథను అందించాడు.
ఇది చారిత్రక కథే అయినా దానిని సినిమాటిక్‌గా విజయేంద్రప్రసాద్ చెప్పిన తీరు నచ్చడంతో ఆమె ఈ ట్రైలర్ వేడుకలో విజయేంద్రప్రసాద్ కాళ్లకి నమస్కారం చేసింది. మొత్తానికి ‘మణికర్ణిక’ ఫలితంలో ఏ మాత్రం తేడా వచ్చినా అది పూర్తిగా కంగనాని విమర్శల పాలు చేయడం ఖాయమనే చెప్పాలి.