సాధారణంగా సినిమాలు ఫ్లాప్ అయితే దర్శకుల కెరీర్ లు నాశనం అవుతుంటాయి. కానీ.. విచిత్రంగా శ్రీనివాస్ రెడ్డి అనే డైరెక్టర్ కెరీర్ మాత్రం హిట్ కొట్టినా ఫెయిల్ అయ్యింది. నాగార్జునతో తెరకెక్కించిన ఢమరుకం సినిమా హిట్టైనా.. బడ్జెట్ పెరగడం, విడుదల విషయంలో చోటు చేసుకున్న కన్ఫ్యూజన్ కారణంగా భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. దాంతో అప్పట్నుంచి శ్రీనివాస్ రెడ్డికి మరో ఆఫర్ రాలేదు. మధ్యలో నాగచైతన్య, హన్సిక జంటగా దుర్గ అనే సినిమా మొదలెట్టినప్పటికీ.. ఆ సినిమా ప్రారంభోత్సవం జరిగిన తదుపరి వారమే ఆగిపోయింది. దాంతో నెక్స్ట్ ఏంటి అనే కన్ఫ్యూజన్ లో ఉన్న శ్రీనివాస్ రెడ్డికి.. తన మునుపటి చిత్రమైన ఢమరుకం చిత్రంలో విలన్ గా నటించిన గణేష్ వెంకట్రామన్ ఒక దారి చూపించాడు.
ఎప్పట్నుంచో హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకుందామనే ప్రయత్నంలో ఉన్న గణేష్ వెంకట్రామన్ మొత్తానికి ఒక ప్రొడ్యూసర్ ను పట్టాడు. ఆ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డికి దర్శకుడిగా అవకాశం కూడా ఇప్పించాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ కు వెళ్లనుంది. పైసా వసూల్ సినిమాలో బాలకృష్ణ సరసన కథానాయికగా నటించిన ముస్కాన్ ఈ చిత్రంలో కథానాయికగా ఎంపికైంది.
ఆ విధంగా.. తాను విలన్ గా పరిచయం చేసిన గణేష్ వెంకట్రామన్ ఇప్పుడు తన సినిమాకి మాత్రమే కాక తన పాలిట హీరోగానూ మారడంతో రాక రాక వచ్చిన ఈ సదవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని నిశ్చయించుకొని ప్రీప్రొడక్షన్ వర్క్ గట్రా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొంటున్నాడు శ్రీనివాసరెడ్డి.