బాహుబలి విడుదలై ఘన విజయం సొంతం చేసుకున్న తర్వాత మన సౌత్ ఇండియా నుంచి మల్టీలింగువల్ సినిమాల నిర్మాణం ఎక్కువైంది. మాది బాహుబలి రేంజ్ సినిమా అని చెప్పడం.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయడం అనేది ఈమధ్యకాలంలో భారీ బడ్జేట్ సినిమాలకు అలవాటైపోయింది. అయితే.. అన్నీ సినిమాలు బాహుబలులు అవ్వవు అని ఒకటికి రెండు సార్లు నిరూపితమవుతూనే ఉండగా.. ఇప్పుడు మరో సినిమా ఆ తరహా విడుదలకు సిద్ధమైంది. కన్నడలో రూపొంది ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమవుతున్న కె.జి.ఎఫ్ అనే సినిమా ట్రైలర్ మరియు ప్రోమోస్ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా బాహుబలి రేంజ్ సినిమాగా నిలుస్తుందని దర్శకనిర్మాతలతోపాటు కథానాయకుడు యష్ కూడా పలుమార్లు పేర్కొన్నాడు.
అన్నీ భాషల్లోనూ ప్రీరిలీజ్ ఈవెంట్స్, స్పెషల్ ఇంటర్వ్యూలు గట్రా చేశారు బాగానే ఉంది. అయితే.. ఇంకో రెండ్రోజుల్లో విడుదలవుతున్న ఈ చిత్రానికి తెలుగులో మాత్రమే కాదు హిందీలోనూ పట్టించుకొనే నాధుడు లేకుండాపోయాడు. తెలుగులో ప్రస్తుతం అందరి దృష్టి పడి పడి లేచే మనసు, అంతరిక్షం వైపు ఉండగా.. హిందీలో షారుక్ ఖాన్ జీరో మీదే ఉంది. ఇక కన్నడలో ఎలాగూ హిట్ అవుతుందనుకోండి.
అయితే.. ఇక్కడ మేటర్ జనాల దృష్టిని ఆకర్షించడంలో కె.జి.ఎఫ్ ఫెయిల్ అవ్వడమే. యూట్యూబ్ లో వెబ్ సైట్స్ లో యాడ్స్ ఇచ్చేస్తే జనాలు థియేటర్లకు వచ్చే రోజులు పోయాయి. ఈ విషయాన్ని టీం ఇంకా గుర్తించినట్లుగా లేదు.. మరి భారీ కాన్వాస్ లో తెరకెక్కించిన ఈ భారీ చిత్రం రిజల్ట్ ఏమవుతుందో చూడాలి.