నిజానికి నటసార్వభౌమ నందమూరి తారకరామారావు వ్యక్తిగత జీవితం లక్ష్వీపార్వతి అంకాన్ని పక్కనపెడితే మిగిలినదంతా చాలా ఫ్లాట్‌గా సాగిపోయే కథ. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌ని ఆయన కుమారుడు, నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేస్తున్నాడు. ప్రతిష్టాత్మకమైన బాలకృష్ణ వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని అతి తక్కువ వ్యవధిలో అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించి, ఓ చారిత్రక చిత్రాన్ని కూడా తామనుకున్నట్లు తీయగలమని నిరూపించిన క్రిష్ జాగర్లమూడి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు బాలయ్య వారాహిచలన చిత్ర అధినేత సాయికొర్రపాటి, విష్ణు ఇందూరిలతో కలిసి మొదటిసారిగా దీనిని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. బాలయ్య నటిస్తూ, నిర్మిస్తుండటం వల్ల ఇందులో ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన వివాదాస్పద అంశాలు గానీ, ఎన్టీఆర్‌ని కాదని చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన విధానం గానీ ఇందులో చూపించే అవకాశాలు లేవు.
కానీ అదే సమయంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ మాత్రం ఎన్టీఆర్ జీవితంలోకి ఆయన రెండో సతీమణి లక్ష్మీపార్వతి ఎంటర్ అయిన తర్వాత ఏర్పడ్డ పరిణామాల నేపధ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని తీస్తున్నాడు. వర్మ కెరీర్‌పరంగా, ఆయన ఆలోచనా ధోరణి, ఆయన ఎంచుకున్న పాయింట్ వంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటే ఈ చిత్రంలో వివాదాస్పద అంశాలను చూపించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
తాజాగా దీనిపై కూడా వర్మ స్పందించాడు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అప్పట్లో ఎన్టీఆర్ పెద్ద స్టార్. ఆయనెంతో ఇమేజ్ ఉన్న పాపులర్ పర్సన్. లక్ష్మీపార్వతి విషయానికి వస్తే ఆమె సాధారణ మహిళ. పెద్ద అందగత్తె కూడా కాదు. అలాంటి ఆమె ఎన్టీఆర్‌కి ఎలా దగరైంది? అనేదే నాకు అతి పెద్ద మిస్టరీగా తోచింది. ఆ ప్రశ్న నుంచే నా పరిశోధన మొదలైంది. ఆ పరిశోధన నుంచే ఈ సినిమా రానుంది. క్రిష్ తెరకెక్కిస్తున్న ‘కథానాయకుడు’లో ఎన్టీఆర్ సినీ జీవితం, ‘మహానాయకుడు’లో ఆయన రాజకీయ జీవితాలను చూపించనున్నారు. కానీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో మాత్రం ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం ఉండనుంది. ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు అని క్లారిటీ ఇవ్వడంతో ఈ చిత్రంపై ఉన్న ఆసక్తి మరింతగా పెరిగిందనే చెప్పాలి. +