హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ - సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ‘పడి పడి లేచె మనసు’ చిత్రం విడుదలకు ఐదు రోజులు మాత్రమే టైం ఉంది. ప్రమోషన్స్ లో జోరు చూపిస్తున్న ‘పడి పడి లేచె మనసు’ టీం రీసెంట్ గా వదిలిన ట్రైలర్ కి విశేష స్పందన వస్తోంది. సాయిపల్లవి నటన, లుక్స్.. శర్వా లుక్స్ మరియు గెటప్ అన్ని ఆకట్టుకునేలా ఉండడంతో సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమాకి నిర్మాతలు దాదాపుగా నలభై కోట్ల పెట్టుబడి పెట్టినట్లుగా ఫిలింనగర్ టాక్. మరి శర్వా రేంజ్ మహా అయితే 30 నుండి 35 కోట్ల వరకు ఉంటుంది.
మరి నిర్మాతలు ఇలా 40 కోట్ల పెట్టుబడి డిజాస్టర్ దర్శకుడిపై ఎందుకు పెట్టారంటారు. హను రాఘవపూడి ‘లై’ సినిమా డిజాస్టర్ అయింది. నితిన్ చేసిన ‘లై’ సినిమాకి అప్పట్లో నిర్మాతలు 35 కోట్ల వరకు పెట్టగా.. ఆ సినిమాకి ఖర్చులు కూడా రాలేదు. మరి ఇప్పుడు ఎలాంటి ప్రేమ కథ అయినా, ఎంత కొత్తగా తీసినా.. 40 కోట్లు శర్వానంద్ మీద పెట్టడం మాత్రం నిర్మాతల తలకు మించిన భారమే అవుతుంది. అయితే ఈ క్యూట్ లవ్ స్టోరీ కి అంత పెట్టుబడి ఎక్కడానికి కారణం ఈ సినిమాలో వేసిన ప్రత్యేక సెట్ అంటున్నారు. సినిమాలోని కీలక సన్నివేశం కోసం ఒక కాస్ట్లీ సెట్ వేయడంతోనే బడ్జెట్ పెరిగిందట.
కోల్‌కత్తా బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకి యాక్షన్ కోసం, అలాగే ఇతర అంటే పబ్లిసిటీ ఇలా అన్నిటికి కలిపి 35 దాటి 40 వరకు ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తుంది. అయితే నిర్మాతలకు సాయి పల్లవి మీద భారీ హోప్స్ ఉన్నాయట. సాయి పల్లవి హీరోయిన్ అయితే సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తాయని.. అందుకే శర్వా గురించి ఆలోచించకుండా నిర్మాతలు ఇలా పెట్టుబడి పెంచినట్లుగా తెలుస్తుంది. దర్శకుడు, హీరో కన్నా సాయి పల్లవి మ్యాజిక్ మీద నిర్మాతలకు పూర్తి నమ్మకం ఉండడం వల్లనే బడ్జెట్ ఎడా పెడా పెట్టినట్లుగా తెలుస్తుంది.
మరి సాయిపల్లవి నటించిన సినిమాల్లో తెలుగులో ఒక్క ‘కణం’ తప్ప మిగతావన్నీ మంచి హిట్స్ అవడం, యూత్‌లో సాయిపల్లవి మీద క్రేజ్, నటన, డ్యాన్స్ ఇలా ఆమెపై ఉన్న అంచనాలే ‘పడి పడి లేచె మనసు’కు భారీ బడ్జెట్‌ను నిర్మాతలు పెట్టేశారట. మరి డిసెంబర్ 21న గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో అంత అమౌంట్ వెనక్కి తీసుకురావడం అనేది సామాన్యమైన విషయం కాదు.