ఛలోతో ఫామ్ లోకి వచ్చిన శౌర్య ఆ సక్సెస్ స్ట్రీక్ ను కంటిన్యూ చేద్దామనుకున్నాడు కానీ.. అదృష్టం కలిసిరాక ఆ తర్వాత రిలీజైన సినిమాలతో హ్యాట్రిక్ ఫ్లాప్ రికార్డ్ ను మాత్రమే సొంతం చేసుకోగలిగాడు. అప్పట్నుంచి కాస్త ఆలోచించి అడుగులేస్తున్న శౌర్యకి ఓ బంపర్ ఆఫర్ తగిలినట్లు సమాచారం. అదేంటంటే.. సుకుమార్ రాసుకున్న ఓ కథకు హీరోగా శౌర్య మాత్రమే న్యాయం చేయగలడు అని ఫిక్స్ అయ్యాడట. వెంటనే శౌర్యని కాంటాక్ట్ చేయగా.. మహాప్రసాదంలా ఆఫర్ ను స్వీకరించాడట. అయితే.. ఈ కథకు సుకుమార్ దర్శకత్వం వహించడు. కుమారి 21F తరహాలో తన శిష్యగణంలో ఎవరో ఒకరికి దర్శకత్వ బాధ్యతను అప్పగించి తాను నిర్మాణం మరియు దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చూసుకుంటాడన్నమాట.
ఇకపోతే.. నర్తనశాల సినిమా కోసం కాస్త లావైన శౌర్య ప్రస్తుతం ఆ కొవ్వును కరిగించి సన్నబడేందుకు కష్టపడుతున్నాడు. అలాగే.. తన స్వంత బ్యానర్ లో మరో కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి కూడా సన్నద్ధమవుతున్నాడట.
నిజానికి.. శౌర్యకి ఉన్న యాక్టింగ్ టాలెంట్ కి, స్క్రీన్ ప్రెజన్స్ కి కెరీర్ తొలినాళ్లలో ఎంచుకున్న కథల తరహాలో సినిమాలు పడితే ఈపాటికి డిపెండబుల్ హీరో అయిపోయేవాడు. కానీ.. అందరి హీరోల్లాగే కమర్షియల్ హీరో అనిపించుకోవాలి, మాస్ హీరో అయిపోవాలి అనే కోరిక పుట్టడంతో "జాదూగాడు" లాంటి డిజాస్టర్ సొంతం చేసుకొని ఒక్కసారిగా ఢీలాపడ్డాడు. మరి తన తప్పు తెలుసుకొన్నాడు కాబట్టి ఇకనైనా తన స్వంత ఇమేజ్ కోసం కష్టపడతాడో లేక మాస్ హీరో ఇమేజ్ కోసం తాపత్రయపడతాడో చూడాలి.